Ramoji Rao: రామోజీరావుకు సుప్రీం కోర్ట్ షాక్

మార్గదర్శి చిట్ ఫండ్స్ డిపాజిట్ల సేకరణలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. చిట్స్ నిబంధనలు పాటించలేదని... డిపాజిట్ల సొమ్మును జిల్లాలు.. ఆపై రాష్ట్రాలకు తరలించారని సిఐడి అభియోగం మోపింది.

Written By: Dharma, Updated On : February 2, 2024 5:14 pm
Follow us on

Ramoji Rao: రాజ గురువు రామోజీకి షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రామోజీరావు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి సరైన కారణాలేవి కనిపించడం లేదని తేల్చేసింది. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించి నిబంధనలు పాటించలేదని చెబుతూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామోజీరావు తో పాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను సైతం సిఐడి విచారించింది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు కేసుల విచారణను బదిలీ చేయాలని రామోజీరావు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ డిపాజిట్ల సేకరణలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. చిట్స్ నిబంధనలు పాటించలేదని… డిపాజిట్ల సొమ్మును జిల్లాలు.. ఆపై రాష్ట్రాలకు తరలించారని సిఐడి అభియోగం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించారని.. ఖాతాదారులకు సొమ్ము చెల్లించడంలో కూడా జాప్యం చేశారని రకరకాల ఆరోపణలను మోపుతూ ఏపీ సిఐడి రామోజీరావు తో పాటు ఆయన కోడలు శైలజ్ కిరణ్ లపై కేసులు నమోదు చేసింది. స్వయంగా ఏపీ సిఐడి అధికారులు రామోజీరావు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. తొలుత గుంటూరులోని సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులు అందించారు. అయితే రామోజీరావు అనారోగ్య కారణాలు చూపడంతో సిఐడి అధికారులు స్వయంగా హాజరై ఆయన నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో శైలజా కిరణ్ విదేశాలకు వెళ్లిపోయారని కూడా ప్రచారం జరిగింది.

అయితే సిఐడి కేసులతో దూకుడు మీద ఉన్న ఏపీ ప్రభుత్వం చర్యలను గమనించిన రామోజీరావు.. ఈ కేసు విచారణలను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి సరైన కారణాలేవీ కనిపించడం లేదని తెలిపింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లు వేసుకోవాలని సూచించింది. విచారణపై స్టేట్ కావాలంటే ఏపీ హైకోర్టు ని ఆశ్రయించాలని తెలిపింది. దీంతో కేసుల విచారణ తెలంగాణకు మార్చాలన్న రామోజీరావు ఆశలపై అత్యున్నత న్యాయస్థానం నీళ్లు చల్లింది.