september 17 telangana liberation day : ఊళ్ళో యాతన, యమయాతన తట్టుకోలేక బయల్దేరారు. పిల్లా పాపా ముసలీముతకా అంతా బయల్దేరారు. శాంతినీ, సుఖాన్నీ వెతుక్కుంటూ. వయసులో ఉన్న ‘దాంకో’ ముందు నడుస్తున్నాడు. వెనక జనం…అడవిలో కొచ్చారు. హఠాత్తుగా చీకటి. చిమ్మచీకటి. సుఖానికి దారేది? ఎలా వెళ్లడం? దాంకో చేతిని తన కడుపులో గుచ్చాడు. ఛాతీలోకి పోనిచ్చాడు. గుండెని పిడికిట పట్టుకొని బయటికి లాగాడు. దాన్ని తలమీద పెట్టుకున్నాడు. వేయి విద్యుద్దీపాల కాంతిలో మెరిసింది గుండె.
ఆ వెలుగుదారిలో ప్రజలంతా నడిచారు. నెత్తుటి మడుగులో దాంకో ఒరిగిపోయాడు.
ఇది గోర్కీ కథ…

కానీ, ఇలాంటి దాంకోలు ఐదువేల మంది మన తెలుగుగడ్డ విముక్తి కోసం పోరాడి నేలకొరిగారంటే, ఈనాడు వింతగా వినేవారు కూడా ఉన్నారు. 40 ఏళ్లనాటి వీరగాథ మరుగున పడిపోతోంది.దాన్ని మరోసారి గుర్తు చేయడానికి ఓ చిన్నప్రయత్నం. భారత స్వాతంత్ర్యం కోసం దేశమంతటా ఎన్నో పోరాటాలు జరిగాయి. రాజుల సంస్థానాల్లోనూ, బయటా పోరాటం సాగింది. కానీ, ఇంత దీర్ఘకాలం, అందునా ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికీ లేదు. ఐదువేల మంది నేలకొరగడం ఏ ప్రాంతంలోనూ జరగలేదు. అది కేవలం, తెలుగునాటనే, తెలంగాణలోనే జరిగింది. ఆరుకోట్ల తెలుగుబిడ్డల ఐక్యతకు ఈ నెత్తురు పునాది వేసింది వీర తెలంగాణ.
ఇంత పెద్ద పోరాటాన్ని 32 పేజీల్లో కుదించి చెప్పడం, చూపడం అసాధ్యమే. అందుకే ఇది సమగ్రమైనదని చెప్పడం లేదు. ఈ చరిత్రని విభిన్నదృక్కోణాల నుంచి చూసిన వారున్నారు. రాసిన వారున్నారు. ఈ చరిత్రపై నాలుగైదు ఏళ్లుగా పరిశోధన చేస్తున్న
పి. బాలకృష్ణ, మేం కోరిందే తడవుగా అపురూపమైన సమాచారమిచ్చారు. బానిసలుగా బతికేది లేదని, ఎదురుతిరిగి, తుపాకీ పట్టి నేలకొరిగిన మన తండ్రులు, తాతలు, అక్కలు, అన్నలను ఈ 40వ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి మనందరం తలుచుకుందాం.
“నీ బాంచెన్ దొరా, నీ కాల్మొక్తా, నీ పెండ్లాం పియ్యి తింటా” ఈ మాటలు మనకీనాడు ఏవగింపు కలిగించొచ్చు. ఏ రోమ్ సామ్రాజ్యంలోని బానిసలో పలికే మాటలుగా మనకి అనిపించవచ్చు. బానిసలు, బానిస వ్యవస్థల గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ, నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణా ప్రజల నోట్లోంచి వచ్చే మాటలు ఇవేనని తెలుసుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణాలో మన ముందు తరం వారు బానిసలుగానే జీవించారనే నగ్నసత్యం, ఆ బానిస బంధాలను తెంచుకునేందుకు
వారు చేసిన సాయుధపోరాటం వింటే మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

హైదరాబాద్ సంస్థానం నూటికి నూరుపాళ్లు మధ్యయుగాలనాటి బానిస సామ్రాజ్యాన్ని మరపించే విధంగా వుండేది. సంస్థానంలో ప్రజలకి కనీస హక్కులు కూడా ఉండేవి కావు. గుడి కట్టాలన్నా, బడి పెట్టుకోవాలన్నా నవాబుగారి అనుమతి పొందాలి. ఒక్క సభ పెట్టుకోవాలన్నా ముందుగా నిజాం అనుమతి కావాలి. సభలో ఎవరెవరు ఏం మాట్లాడేది ముందుగానే రాసి ఇవ్వాలి. ఆ ఉపన్యాసాల్లో నిజాంకి వ్యతిరేకంగా గానీ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గానీ ఒక చిన్నమాట ఉన్నా సభని అనుమతించేవారు కాదు. నిజాం నోట్లోంచి వచ్చే ప్రతిమాటా ఫర్మానా అయ్యేది. నిజాంని కీర్తిస్తూ, “ఈ లోకానికి చంద్రుడూ, సూర్యుడు నైజాం నవాబే” అనే గీతాలు విద్యాలయాల్లో విద్యార్థుల చేత పాడించేవారు. విద్యాలయాలపై కూడా మిగులు ఆదాయం పొందేవారు. ప్రజల్లో విద్యావ్యాప్తి జరిగితే వారిలో చైతన్యం వస్తుంది. అన్యాయాలకీ, అక్రమాలకీ స్పందించి తిరగబడతారు. అందుకే విద్యావ్యాప్తిని ఎన్ని విధాలుగా అరికట్టాలో అన్ని విధాలుగా అరికట్టారు. విద్య అంతా ఉర్దూ భాషలోనే.
తెలుగు భాషనీ, సంస్కృతినీ నైజాం అధికారులు చులకన చేసేవాళ్ళు. ‘తెలంగి భేదంగి’ (ముక్కూ మొహం లేనిది) అని వెక్కిరించేవాళ్ళు. నైజాం కన్నా రెండాకులు ఎక్కువ చదివిన జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు కట్టాల్సిన పన్ను కన్నా రెట్టింపు చెప్పి రైతులను పీడించి పన్ను వసూలు చేసేవారు. ఆడామగ భేదం లేకుండా రైతు కుటుంబాలను చిత్రహింసల పాలుచేసేవారు. చెవులకు బరువులు కట్టేవారు. ఛాతీపై బండలు పెట్టేవారు. కాగే నూనెలో వేళ్ళు ముంచేవారు. ఆ బాధలు తట్టుకోలేక, పన్నుకట్టుకోలేక, భూమిని వాళ్ళపరం చేసేవారు రైతులు. ఇలా జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, వేలకు వేల ఎకరాల భూమి సంపాదించారు. విసునూరు రామచంద్రారెడ్డి, జానారెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశ్ ముఖ్ ల వద్ద 30, 40 వేల ఎకరాల సాగుభూమి ఉండేది. బ్రాహ్మణులు కూడా వెట్టి నుంచి తప్పించుకోలేక పోయారు. బ్రాహ్మణులు విస్తర్లు కుట్టి జాగీర్దార్లకు ఇవ్వాల్సి వచ్చేది. ఇక ఇతర కులాల సంగతి చెప్పుకోనవసరమే లేదు.
విసునూరు ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన కోటే విసునూరు దేశ్ ముఖ్ గడీ. దొరకి మక్కువైన స్త్రీకి మరోమార్గం వుండేది కాదు. చావడమో, దొర పక్కలోకి వెళ్ళడమో జరిగేది. నచ్చిన స్త్రీలను తెచ్చుకుని మక్కువ తీరేవరకూ తమతో పెట్టుకోవడం ఆనాటి దొరలకి ఒక మాములు అలవాటు. పసిపిల్లల తల్లులకూ రక్షణ లేదు. పిల్లలకు పాలు ఇవ్వడానికి బాలింతలని వదిలేవారు కాదు. కాళ్ళావేళ్ళాపడి బతిమిలాడితే డొప్పల్లో పాలుపిండి పంపుకోమనేవాళ్ళు. ఈ దుర్భర పరిస్థితుల్లోనే ఒక వెలుగురేఖలా, ఆశాదీపంలా ఆంధ్రమహాసభ ముందుకొచ్చింది.
1940 నుంచి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆంధ్రమహాసభ ప్రజాసమస్యలపై పోరాటం ప్రారంభించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ తెలంగాణ చరిత్రనే మార్చి వేసింది. 40 వేలమంది ప్రజలు హాజరైన ఈ మహాసభలో రావి నారాయణరెడ్డి అధ్యక్షుడు కావడం జాగీర్దార్లను భయబ్రాంతులని చేసింది.
సంఘం అండతో, “వెట్టి చేయం” అంటూ జనం తిరగబడ్డారు. దెబ్బకు దెబ్బ తీయండి అని సంఘం పిలుపు ఇచ్చింది. జాగీర్దార్లు కర్రలతో, పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. సంఘనాయకులు లేని తరుణం చూసి కడివెండి గ్రామప్రజలను రెచ్చగొట్టి, వాళ్లపై కాల్పులు జరిపించింది విసునూరు దేశ్ ముఖ్ తల్లి. ఆ పోరాటంలో తుపాకీ గుళ్ళకి బలై నేలకొరిగాడు దొడ్డి కొమరయ్య.
1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం, తెలంగాణా విప్లవ ప్రభంజనానికి నాంది పలికింది. తెలంగాణా ప్రజలు అగ్గిసెగలై చెలరేగిపోయారు. కర్రలతో, వడిసెలలతో జనం పోరాటానికి దిగారు. అటు తుపాకీ గుళ్ళ వర్షం కురుస్తోంది. అప్పుడే, 1947 సెప్టెంబర్11వ తేదీన ఆంధ్ర మహాసభ సాయుధపోరాటానికి పిలుపు ఇచ్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మక్ధూం మోహియుద్దీన్ చరిత్రాత్మక తెలంగాణా సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చారు. ఆయుధాలకై ఆంధ్రప్రాంత ప్రజల సహాయం కోరారు. ఆయుధాల కోసం ఆంధ్రులు వేల రూపాయలు ఇచ్చారు.
ఒక్క విజయవాడ ప్రాంతంలోనే రావి నారాయణరెడ్డికి 25 వేల రూపాయలు ఇచ్చారు. కర్నూలులో మక్దుం మోహియుద్దీన్ కి స్వాగతం పలికి ప్రజలు వేల రూపాయలు ఇచ్చారు. తెలంగాణా ప్రజలకి ఆంధ్రప్రాంతంలో ఆయుధశిక్షణ ఇచ్చి పంపారు. అప్పుడు తెన్నేటిసూరి (చంఘీజ్ ఖాన్ నవలా రచయిత) సమాధాన మెవ్వడురా? అనే కవిత రాశారు. బాల వీరులెవ్వరురా?బాలచంద్రులెక్కడరా? ‘సవాల’ న్న నైజాముకు, సమాధానమెవ్వడురా? తెలుగుబిడ్డలెక్కడరా? వెలుగుకత్తులెక్కడరా? తెలుగువాడి పురుటిగడ్డ, తెలంగాణ మనరాజ్యం కలబడగల మొగాడుంటే, కలుపుకోండి మీరాజ్యం. తెలంగాణ తమ్మునిపై చెయ్యెత్తిన కబంధుణ్ణి వధించగల మొగాడుంటే, బయల్దేరు బరిమీదకి మనతల్లి చీరలొల్చి మానభంగమటరా, ఛీ బ్రతికెందుకు మనమింకా, బయల్దేరు బయల్దేరు తెలంగాణ బాలులార, అన్నలార! తమ్ములార! హడలకండి వస్తున్నాం, వస్తున్నాం, వస్తున్నాం! తెలుగు తమ్ములొస్తున్నాం, కబంధుణ్ణి నిబంధుణ్ణి కండలుగా నరికేస్తాం. నైజాం నరహంతకులను నల్లులుగా నలిపేస్తాం, జడవకండి జడవకండి కడికండలు రాల్చేస్తాం! నైజాముల గీజాములు
ఖతం ఖతం చేసేస్తాం! వస్తున్నాం వస్తున్నాం తెలంగాణ వస్తున్నాం!
ఆనాడే కాళోజీ ‘ఇంకెన్నాళ్లు?’ అని రాశారు.
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్లు? హింసను పాపమనెంచు దేశమున హిట్లరత్వమింకెన్నాళ్లు? కలముపోటున కదపజాలని కావ్యగానమింకెన్నాళ్లు? అని ప్రశ్నించారు కవి కాళోజీ.
యాదగిరి ఆ రోజుల్లో రాసిన నైజాము సర్కరోడా, నాజీల మించినోడా యమబాధలు పెడ్తివి కొడకో… చుట్టుపట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ ఆవాల హైద్రాబాదా, తర్వాత గోలకొండ
గోలకొండా ఖిల్లకింద నీ గోరీకడతం కొడకో
నైజాము సర్కరోడా! పాట యావత్ తెలంగాణని ఒక్కపిడికిలిగా మార్చింది.
బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి
ఏ బండ్లో పోతవ్ కొడకో
నా కొడక ప్రతాపరెడ్డి
దొడ్లన్ని కాలిపోయె, ఎడ్లన్ని ఎల్లిపోయె
ఇకనైన లజ్జలేద, నా కొడక ప్రతాపరెడ్డి
గొల్లోళ్ళ గొర్లు ఒడిసె, రైతోళ్ల బియ్యమొడిసె
ఇక ఏమి తింటవు కొడకో, నా కొడక ప్రతాపరెడ్డి! పెదపంది ‘సూరిగాడు’, సినపంది ‘మల్లిగాడు’,
మీ ఇద్దర్ని తింటం కొడకో
నా కొడక ప్రతాపరెడ్డి అనే పాట జనాన్ని ‘ఊగించి ఉరికించింది, ఈ పాట ఎవరు రాసారో తెలీదు.
నిజాం నవాబు సైనికులైన రజాకార్లు లెక్కలేనన్ని దుర్మార్గాలు చేశారు. ఖాసిం రజ్వి అనే ఎం. ఐ. ఎం అధిపతి, పచ్చినెత్తురు తాగిన రాక్షసుడు వీళ్ళ నాయకుడు.
* రజాకార్లు గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడేవాళ్ళు. మానభంగాలు చేయడం ఒక నిత్యకృత్యం. టీ పెట్టాలని ఆదేశించేవాళ్ళు, పాలులేవని చెబితే ఆడాళ్ళ చనుబాలతో టీ పెట్టాలని చెప్పేవాళ్ళు.
*1948 ఆగస్ట్ 27: నల్గొండ జిల్లా బైరాన్ పల్లి గ్రామాన్ని 400మంది రజాకార్లు చుట్టుముట్టారు. దాడులూ, హత్యాకాండ ముగిశాక దొరికిన అమాయకులైన 90మంది పిల్లలూ, యువకులు, వృద్ధుల్ని నాలుగు వరసల్లో నిలబెట్టి కాల్చి చంపేశారు. ఆ రోజున మొత్తం120మందిని వాళ్ళు హతమార్చారు.
*నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని షోయబుల్లా ఖాన్ అనే జర్నలిస్టు రెండు చేతులూ నరికేశారు. తర్వాత ఆయన్ని కాల్చి చంపారు.
* దయాళువైన ధనరాసులతో తులతూగిన నిజాం ప్రభువుల వారికి భార్యలూ, ఉంపుడుగత్తెలు, కేవలం100మంది మాత్రమే, ఇంకా ఎక్కువేనేమో!
ఈ అరాచకాలకూ, క్రూరపాలనకూ వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది కమ్యూనిస్టు పార్టీ. వేలమంది వీరుల్ని, కార్యకర్తల్ని కోల్పోయింది కమ్యూనిస్టు పార్టీ. సాధారణమైన గ్రామీణుల్ని, వ్యవసాయదారుల్ని, గృహిణుల్ని, 20 ఏళ్ళు కూడా నిండని కుర్రాళ్ళని సాయుధ సైనికులుగా మార్చింది కమ్యూనిస్టు పార్టీ. చావో రేవో అని తెలంగాణ కోసం తెగించి పోరాడిన పార్టీ నాయకులకూ, కమ్యూనిస్టు సైనికులకూ వేధింపులు, జైలుశిక్షలు, ఉరిశిక్షలు బహుమానంగా దక్కాయి.
హైదరాబాద్ సంస్థానం కోసం వచ్చిన కేంద్రసైనిక బలగాల కమెండర్లు, ఇక్కడి జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లనే హృదయంలేని భూస్వాములతో లాలూచీపడి చేసిన కిరాతకాలు అన్నీ ఇన్నీ కావు!
ఐనా, ఇది విలీనమే!
భారత హోంమంత్రి సర్దార్ పటేల్ ఎదుట రెండు చేతులూ జోడించి, నిజాం లొంగిపోయాడు గనక ఇది విలీన దినమే!
ఇది తెలంగాణా విమోచనమే!
ప్రజలకు నరకం చూపించిన నిజాం నిరంకుశ పాలన అంతమయ్యింది గనక ఇది నిజంగా తెలంగాణ విమోచనదినమే!
అవును, ఇది అక్షరాలా విద్రోహమే!
తెలంగాణా విముక్తి పోరాటాన్ని అగ్రభాగాన నిలిచి నడిపించిన కమ్యూనిస్టుల శౌర్యాన్ని, త్యాగాన్ని తలుచుకోడానికి కూడా ఇష్టపడనివాళ్ళు, తెలంగాణా తేజోమూర్తులం మేమేనని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నవాళ్ళు…మన కళ్ళముందే ఉన్నారు గనక, నిస్సంశయంగా ఇది విద్రోహదినమే!
సెప్టెంబర్17 2022
75 సంవత్సరాల క్రితం మన తెలంగాణాలో జరిగిన పోరాటానికి గుర్తుగా…
విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని నినదించిన, గర్జించిన, ఉద్యమించిన, ప్రాణాలకు తెగించిన
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మక్దుం మొహియుద్దీన్, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యల స్మృతికి ఈ చిన్ని వ్యాసం అంకితం.
-తాడి ప్రకాష్