Mammootty Rorschach movie telugu Review : ఇది రొడ్డ కొట్టుడు సినిమా రోజులు కావు..తెర మీద అధికారికమైన హీరోయిజం చూసేందుకు ప్రేక్షకుడు ఇష్టపడటం లేదు. కంటెంట్ బేస్డ్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ కథలను బాగా ఇష్టపడుతున్నాడు. కోవిడ్ తర్వాత ఎంగేజింగ్ గా సీట్స్ లో కూర్చోబెట్టే సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు.. ఇదే క్రమంలో ఈ తరహా కథలతో మలయాళం, కన్నడ, తమిళంలో సినిమాలు రావడం, ఓటీటీల్లో స్ట్రీమ్ కావడంతో ప్రేక్షకులు వాటికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన రోషాక్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. గత నెలలో మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు నిషమ్ బషీర్ దర్శకత్వం వహించారు. సైకో థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అన్నట్టు ఈ సినిమాని మమ్ముట్టి నిర్మించారు.

కథ ఏంటంటే
విదేశాల్లో స్థిరపడిన ల్యూక్ ఆంటోనీ( మమ్ముట్టి) తన భార్యతో కలిసి కేరళ విహారయాత్రకి వస్తాడు. కారులో దంపతులిద్దరూ అడవి మార్గం మీదుగా వెళుతుండగా అనుకోని ప్రమాదం జరుగుతుంది. దీంతో ఆంటోని స్పృహ తప్పి పడిపోతాడు. అతడు లేచి చూసేసరికి భార్య కనిపించదు. కంగారుపడి దగ్గర్లోని ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు.. విచారణ నిర్వహించిన అనంతరం నీ భార్య విషయంలో ఎటువంటి ఆచూకీ దొరకలేదని పోలీసులు వివరిస్తారు.. దీంతో తానే రంగంలోకి దిగుతాడు. ఇక అప్పటినుంచి అడవిలోనే ఉంటాడు.. అయితే ఆంటోనీ ప్రవర్తన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడం ప్రారంభిస్తారు. అసలు ఈ ఆంటోనీ ఎవరు? కేరళ ఎందుకు వచ్చాడు? పోలీసులు అతనిని ఎందుకు అనుమానిస్తున్నారు? అతడు చెప్పేది మొత్తం నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే డిస్నీ హాట్ స్టార్ లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది అంటే
సాధారణంగా సైకలాజికల్ మూవీస్ లో మంచి కథ, ఊహించని మలుపులు, పెద్దగా మాటలు లేని పోరాటాలు, ఉత్కంఠ రేపే నేపథ్య సంగీతం, మధ్య మధ్యలో మన కళ్ళను మాయ చేసే కెమెరా వర్క్… ఇవి కుదిరితే చాలు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోతారు. ఇలాంటి సూత్రం అనుసరించాడు కాబట్టే రాక్షసన్ సినిమా దర్శకుడు రామ్ తోపు అనిపించుకున్నాడు. వీటన్నింటినీ మించి సస్పెన్స్ లేదా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కావాల్సింది బెస్ట్ స్క్రీన్ ప్లే. సన్నివేశాలలో ఎంత మేటర్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగలిగితే ప్రేక్షకులు ఫీదా అవుతారు. ఇలాంటి సినిమాల్లో డార్క్ ఫ్రేమ్స్ ను ఒడిసి దర్శకులే సఫలీకృతులు అవుతారు. ఇక ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే చాలా షార్ప్ గా ఉంటుంది. మమ్ముట్టి సినిమా అంటే దక్షిణాది ప్రేక్షకులంతా ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. సినిమా ప్రారంభమే పోలీస్ స్టేషన్ సీన్ తో ఉంటుంది. ఆంటోనీ కేరళ రావడం, రోడ్డు ప్రమాదం జరగడం, అతని భార్య కనిపించకపోవడం, ఇక్కడి నుంచి అతడి అన్వేషణ ప్రారంభం కావటం.. ఇలా వరుస సన్నివేశాలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి.. సినిమా ప్రారంభం అదిరిపోయింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దర్శకుడు అసలు కథలోకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఒక మనిషి తనకు బాగా దగ్గర మనిషిని కోల్పోతే ఎలాంటి వేదన అనుభవిస్తాడో ఆ సన్నివేశాలు దర్శకుడు చాలా బాగా రాసుకున్నాడు. ఆ తర్వాత అడవిలో హీరో ఒక ఇల్లు కొనుక్కోవడం, ఆ ఇంటి యజమాని చనిపోవడంతో కథలో ఉత్కంఠ కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఆ యజమానిని ఆంటోనీ చంపాడా లేక మరెవరైనా ఇలా చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. అయితే ఇలాంటి థ్రిల్లింగ్ సీన్స్ చాలానే ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు ఎక్కడో ఇంకా క్లారిటీ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ లో ఉంటారు. దర్శకుడు స్క్రీన్ ప్లే ని రెండు యాంగిల్స్ లో ప్రెసెంట్ చేసేసరికి ప్రేక్షకుల్లో కొన్ని సందేహాలు కలగవచ్చు. అయితే ఆసక్తికరమైన మలుపుతో ఇంటర్వెల్ పడుతుంది.. ఇక ద్వితీయార్ధానికి వచ్చేసరికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఎందుకో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపించదు. ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో దర్శకుడు కొన్ని చిక్కుముడులను అలాగే ఉంచాడు. ఇక ఈ సినిమాకి మిధున్ ముకుందన్ సంగీతం ప్రాణం పోసింది. నిమిష్ రవి ఫోటోగ్రఫీ చాలా బాగుంది.. ఎడిటర్ సినిమా లెంగ్త్ ఇంకా తగ్గిస్తే బాగుండు.. ఇక చాలా రోజుల తర్వాత మమ్ముట్టి వన్ మ్యాన్ షో చేశాడు..మిగతా పాత్రలలో బిందు ఫణికర్, షరఫుద్దీన్ నటించారు. సమీర్ ఈ సినిమాపై చాలా స్టడీ చేసి రాశాడు..
ప్లస్ లు
స్టోరీ లైన్
మమ్ముట్టి
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ లు
సినిమా నిడివి
కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్
అక్కడక్కడ కొన్ని చిక్కుముడులు
బాటమ్ లైన్: థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి కొత్త అనుభూతి ఇస్తుంది
రేటింగ్: 2.5/5