Maa Election Controversies : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత రచ్చ జరిగాయో మనం కళ్లారా చూశాం.. ఇంకా ఆ వేడి చూస్తూనే ఉన్నాం. ఓ వైపు ప్రకాష్ రాజ్ వర్గం.. మరోవైపు మంచు విష్ణు వర్గాలు వీధినపడి కొట్టుకున్న తీరు సాధారణ ఎన్నికలను తలపించింది. రాజకీయ నాయకులను మించి సినీ ప్రముఖులు తిట్టుకున్న వైనాన్ని అందరూ విస్తుపోయి చూశారు. ఈ సిని‘మా’ మంటలను మీడియా చలికాచుకుంది. అయితే ఇంత రచ్చ జరగడానికి అసలు కారణం ఏంటి? ‘మా’లో విభేదాల వెనుక అసలు చీకటి కోణం ఏంటి? ‘మా’గొడవలకు అసలు కారణాలు తాజాగా బయటపడ్డాయి. అవి సంచలనమయ్యాయి..

‘మా’ ఎన్నికల సందర్భంగా అంత రచ్చ జరగడానికి.. సినీ ప్రముఖుల మధ్య ఇంత చిచ్చు రేగడానికి ప్రధాన కారణమైన ఒక రహస్య ఎజెండా తాజాగా బయటపడింది. అదే ‘‘మా భవన నిర్మాణం’’. అలసు మా ఎన్నికలు జరిగిందే ‘మా భవన నిర్మాణం’ గురించి.. ఇన్నాళ్లుగా ఎన్నికలు జరిగేది ఆ భవనం కోసమే. ఎంతో కాలంగా ఈ భవన నిర్మాణమే ‘మా’ ఎన్నికల అజెండాగా మారుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు కూడా పోటీకి దిగినప్పుడు తొలి ప్రాధాన్యం ‘మా’ భవన నిర్మాణమే అని చెప్పారు.
మా భవన నిర్మాణం ఎవరు నిర్మించాలన్నది ఇన్నాళ్లు ఒక చర్చనీయాంశంగా ఉంది. దానికి నిధులు సమకూర్చాలన్నదే ప్రధాన ఎజెండా ఉంది. దీనికోసం ప్రభుత్వాన్ని అడగాలి.. అందరూ తలా కొంత వేసుకోవాలని రకరకాల ప్లాన్లు చేశారు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన డిమాండ్ కాదు.. 20 ఏళ్లుగా ‘మా’ లో పెండింగ్ లో ఉన్న సమస్య. మధ్యలో ‘మా’ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఆ ఫ్లాట్ కూడా తక్కువ ధరకు అమ్మేశారు. అది కూడా వివాదాస్పదం అయ్యింది.
అయితే ఈసారి మాత్రం ‘మెగాస్టార్’ ఫ్యామిలీ పంత పట్టిందట.. ‘మా’ భవనానికి సంబంధించి సింహభాగం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చిందట..తద్వారా తమ పేరు ‘మా’ భవనం మీద చిరస్థాయిగా ఉండిపోవాలని మెగా ఫ్యామిలీ ఈ స్కెచ్ గీసిందట..
గతంలోనూ ఇలానే జరిగింది. దిగ్గజ నిర్మాత రామానాయుడు సినీ కళాకారుల ఫంక్షన్ల కోసం అత్యధిక నిధులు కేటాయించి ఓ కళ్యాణ మండపం నిర్మించారు. దానికి ఆయన పేరే పెట్టారు. సాధారణంగా ఎవరైతే స్పాన్సర్ షిప్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వారి పేరు ఆ భవనానికి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
అందులో భాగంగానే ‘మా’ భవన నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించి తమ పేరును భావిత రాల్లో శాశ్వతంగా ఉంచుకోవాలని మెగా ఫ్యామిలీ ముఖ్యంగా చిరంజీవి భావించారని సమాచారం. అందుకోసం ఈసారి ఖచ్చితంగా ‘మా’ ఎన్నికల్లో తమ వ్యక్తిని గెలిపించుకొని తద్వారా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని చిరంజీవి భావించారని చెబుతున్నారు.
అందులో భాగంగానే ఈ ‘మా’ ఎన్నికల్లోకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. తమకు సన్నిహితుడైన ప్రకాష్ రాజ్ ను ‘మా’ అధ్యక్షుడు చేయాలని చిరంజీవికి చెప్పినట్లు తెలిసింది. ‘న్యూట్రల్ ’ వ్యక్తి అయిన ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుందని.. తమ ఆకాంక్షను సైతం ముందుకు తీసుకెళుతాడని మెగాస్టార్ కూడా భావించి ప్రకాష్ రాజ్ కు సపోర్టు చేశాడట.. ప్రకాష్ ద్వారానే తమ ‘మా’ భవన నిర్మాణం పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట..
అయితే ఇది ఆనోటా ఈనోట నటుడు నరేశ్ కు విషయం తెలిసిందట.. చిరంజీవి ప్లాన్, మంత్రి కేటీఆర్ సూచనలు తెలిసి మోహన్ బాబు వద్ద నరేశ్ ప్రస్తావించారట.. వెంటనే దీనికి విరుద్ధంగా రంగంలోకి ‘మంచు ’ ఫ్యామిలీ దిగడం.. విష్ణు అయితే అధ్యక్షుడిగా నామినేషన్ వేయకముందే.. మా ఎన్నికల్లో దిగుతున్నట్టు ప్రకటించకముందే మా భవన నిర్మాణం కోసం మూడు స్థలాలు కూడా చూసి ఓకే చేయడం చకచకా జరిగిపోయింది. దీనికి తామే నిధులు కూడా సేకరించి.. సొంతంగా పెట్టుకొని పూర్తి చేస్తామన్నాడు. చిరంజీవి పేరును ‘మా’ భవనంపై చిరస్థాయిగా ఉండనీయవద్దనే తలంపుతో మోహన్ బాబు అండ్ కో ఈ పనిచేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మా’ భవన నిర్మాణం విషయంలో ఎలాగైనా చిరంజీవి ఫ్యామిలీకి ఆ ఖ్యాతి దక్కకూడదు.. చిరంజీవి పేరు చిరస్థాయిగా ‘మా’ భవనంపై ఉండకూడదన్న పట్టుదలతో మంచు ఫ్యామిలీ పనిచేసినట్లు సమాచారం. దీనికి కమ్మ సామాజికవర్గం కూడా తోడై.. మా సామాజికవర్గానికే ఆ పేరు దక్కాలన్న ఉద్దేశంతో మంచు ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో పోటీచేసినట్లుగా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ‘మా’ భవనం కోసం మంచు ఫ్యామిలీ 20శాతం నిధులు వెచ్చించేందుకు సిద్ధమైంది. దీనికి నందమూరి బాలక్రిష్ణ సైతం 20శాతం నిధులను ఇస్తానని చెప్పాడట.. దీంతో కమ్మ సామాజికవర్గం చేతుల్లోనే ఈ భవనం రూపుదిద్దుకోవాలని డిసైడ్ అయ్యారట.. కమ్మ సామాజికవర్గం సినీ ప్రముఖులతో చర్చించి మొత్తం నిధులు సేకరించి తమ పేరే పెట్టుకుందామని మంచు ఫ్యామిలీ పట్టుదలగా ఎన్నికల్లో పోరాడిందట..
ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో తమ పేరు పెట్టుకోవాలని మంచు ఫ్యామిలీ.. లేదు స్వర్గీయ ఎన్టీరామారావు పేరు పెట్టాలని బాలక్రిష్ణ భావిస్తున్నట్టు సమాచారం. మెగా ఫ్యామిలీకి ఆ ఖ్యాతి, అర్హత దక్కకూడదన్నది వీరి పంతమట.. అందుకే ‘మా’ ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నం చేసిందని.. దీనికి కమ్మ సామాజికవర్గం మొత్తం కూడా ఒక్కటై పనిచేశారన్నది ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదే ‘మా’ ఎన్నికల్లో ఇంత రచ్చ జరగడానికి కారణం అని.. మా భవనం కోసమే ఇంత గొడవ జరిగిందని.. ఇదే ఇన్నర్ ఎజెండా అని సమాచారం.
చిరంజీవి ఈ ప్లాన్ తో మంచు ఫ్యామిలీని ఏకగ్రీవం చేయాలని అడగడం.. ఈ సీక్రెట్ తెలిసి మంచు ఫ్యామిలీ నిరాకరించి పోటీచేయడం.. ఇవన్నీ ‘మా’ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి చేతికి చిక్కనీయకుండా తామే నిర్మించి తమ పేరే వేయించుకోవాలని కమ్మ సినీ ప్రముఖులంతా ఒక్కటై చేసిన మంత్రాంగం ఇదీ అని తెలుస్తోంది. మరి దీనికి చిరంజీవి వర్గం ఏం చేస్తుందనేది తెలియాల్సిన అవసరం ఉంది. చిరంజీవి ఇందులో పార్టిసిపేట్ అవుతారా? లేక సపరేట్ గా భవనం కడుతారా? అన్నది వేచిచూడాలి. ‘మా’ భవనమే ఇంతటి ‘మా’ ఎన్నికల లొల్లికి కారణమని.. ఇదే రహస్య ఎజెండా అని చెబుతున్నారు.