ABN RK Vs KCR: జర్నలిజం అంటే వాగాడంబరం కాదు.. విషయాడంబరం.. పరిజ్ఞానాడంబరం.. వెనుకటి రోజుల్లో నండూరి రామ్మోహన్ రావు, గజ్జల మల్లారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ, పతంజలి వంటి వారు తమకున్న పరిజ్ఞానం ద్వారా, వర్తమాన అంశాలపై ఉన్న పట్టు ద్వారా పాత్రికేయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పాత్రికేయ రంగంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు. అందుకే నేటికి కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దైనందిన జీవితంలో చర్చించుకుంటున్నాం. ఒకానొక దశలో పై లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయులు యాజమాన్యాలను కూడా ధిక్కరించే వారట. ఇప్పటి పరిస్థితిని చూసుకుంటే యాజమాన్యాలు అధికార పార్టీలకు మడుగులు వత్తే వ్యవస్థలుగా మారిపోయాయి. కానీ ఈ జాబితాలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూర్తి డిఫరెంట్.
ఒక్క చంద్రబాబు మినహా మిగతా ఎవరితోనూ అంతగా మౌల్డ్ అయ్యే రకం కాదు అతను. కెసిఆర్ తో సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పటికీ వార్తల విషయంలో వైరమే నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో కేసీఆర్ పోకడలను రాధాకృష్ణ వ్యతిరేకించారు.. అయితే అదే సమయంలో కెసిఆర్ ఆగ్రహాన్ని చవిచూశారు. తన ఛానల్ పై నిషేధం విధించడంతో కోర్టుకు వెళ్లి మరి దాన్ని పరిష్కరించుకున్నారు. ఇక తన కార్యాలయం కాలిపోతే ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ఆమధ్య కొద్ది రోజులు కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ మళ్లీ రాధాకృష్ణ తన పాత బుద్ధిని చూపించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాను కేసీఆర్ భజన చేయలేనని, ఇచ్చిన స్థలం కూడా వెనక్కి తీసుకోవచ్చని వర్తమానం పంపారట.. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ దశాబ్ది వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాధాకృష్ణ వార్తలు రాస్తున్నారు. ఈ సమయంలో తనకు అత్యంత అనుకూలమైన చంద్రబాబును తెలంగాణలో జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కె సి ఆర్ మాత్రమే కాదు ఆంధ్రాలోను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కూడా రాధాకృష్ణకు వైరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు అప్పట్లో అంటే 2019లో బిజెపికి వ్యతిరేకంగా కూడా ప్రవర్తించారు. వాస్తవానికి జర్నలిజం అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడం.. ఇదే రాధాకృష్ణ విషయానికొస్తే ఆయన కేవలం చంద్రబాబుకు మాత్రమే అనుకూలంగా ఉంటాడు. . మిగతా వారి విషయంలో తన అవసరాలకు అనుగుణంగా ఉంటాడు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబును చాలా బలంగా లేపుతున్నాడు. కెసిఆర్ ను చాలా బలంగా వ్యతిరేకిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి దగ్గర అయినట్టు కనిపిస్తున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫోల్డ్ లోకి వెళ్లిపోయాడు. ఒకే వ్యక్తి, బహుళ ప్రయోజనాలు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు. అంతటి కాకలు తీరిన రామోజీరావు జగన్ ముందు సాగిల పడితే.. రాధాకృష్ణ మాత్రం మీసం మెలేస్తున్నాడు. చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడు. తనకు ఎటువైపు నుంచి సపోర్ట్ వస్తుందో తెలియదు కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు మాత్రం గుడ్డిగా ఎదురు వెళుతున్నాడు. రేపటి నాడు ఏమవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రాధాకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో టెంపర్ మెంట్ ఉన్న జర్నలిస్టుగా పేరు గడిస్తున్నాడు. ఇదే సమయంలో కొంతమంది వ్యక్తులు, పార్టీలు రాధాకృష్ణకు సహకరిస్తున్నాయి. అందువల్లే అటు కేసీఆర్ కు,ఇటు జగన్ కు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. వ్యాపారాలు ఉన్నప్పటికీ అవి ఇతరుల పేరు మీద ఉండడంతో రాధాకృష్ణ అసలు రూపం బయటకు కనిపించడం లేదు. లేకుంటే మరో రామోజీరావు అయ్యేవాడే.