AP Politics Pawan Jagan Chandrababu : ఏపీ రాజకీయం అంతా ‘ఛాన్స్’లపైనే నడుస్తోంది. ఆంధ్ర ప్రజలను ఏపీ నేతలంతా తమకు అధికారం కల్పించాలని ఎవరికి తోచినట్టు వారు వేడుకుంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ‘ఒక్క ఛాన్స్’ అంటూ చేసిన ప్రకటన ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆయన ప్రత్యర్థి పార్టీలను ఇది కలవరపెట్టింది. అందుకే తేరుకున్న జగన్ ‘మరో ఛాన్స్ ఇవ్వాలని.. ఈసారి ఇస్తే 30 ఏళ్లు అధికారం మనదే’నంటూ ప్రజలను కోరారు. ఇక వీరిద్దరూ దూకుడుగా వేడుకోవడం చూసి వెనకబడ్డ చంద్రబాబు.. తన వృద్ధాప్యం, వయోభారాన్ని సాకుగా చూపి సెంటిమెంట్ రాజేశారు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో ఈ ఒక్కసారి తనకు ‘లాస్ట్ ఛాన్స్’ ఇవ్వాలని.. ఈసారి గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో సంచలన ప్రకటన చేశారు. మరి ముగ్గురూ ఏపీ ప్రజలను ‘ఛాన్స్’ ల కోసం ప్రాధేయపడుతున్నారు. ఇందులో జనాలు ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎవరిని గద్దెనెక్కిస్తారన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-పవన్ కళ్యాణ్ కు ‘ఒక్క ఛాన్స్’ లభిస్తుందా?
రాజకీయాల్లో పాతనీరు పోవాలి.. కొత్త నీరు రావాలి. ఐదేళ్లు కాగానే పాలకులను మార్చేయడం ప్రజలకు అలవాటు. దాన్నే బేస్ చేసుకొని తనది 25 ఏళ్ల రాజకీయం అన్న పవన్ పార్టీ పెట్టి ఒకసారి ఓడిపోయాక.. ఆ సెంటిమెంట్ తో ఈసారి ‘ఒక్క ఛాన్స్’ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. విజయనగరంలో ఆయన చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది. సినిమాల్లో సంపాదించిన తన సొంత డబ్బును ప్రజల కోసం కష్టపెడుతున్నానని.. తనను గెలిపిస్తే అవినీతి చేయనని.. మీ డబ్బులు మీకే పెడుతానని.. ఇప్పటి వైసీపీలా అవినీతి పాలన చేయనంటూ పవన్ చేసిన ప్రకటన ప్రజలకు చేరువైంది. 2014లో పవన్ పోటీచేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీతో కలిసి సాగుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వయసైపోవడం.. ఆయన బలంగా నిలబడకపోవడంతో జగన్ కు పోటీగా పవన్ కనిపిస్తున్నారు. ప్రజలు కూడా పవన్ లోనే ప్రతిపక్ష నేతను చూస్తున్నారు. గట్టిగా పోరాడుతూ ప్రజలకు పవన్ చేరువ అవుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో కీలక శక్తిగా ఎదిగే అవకాశం పవన్ కు ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఇదే ‘ఒక్క ఛాన్స్ ’ అన్న జగన్ ను ప్రజలు కరుణించారు. అధికారం అప్పగించారు.ఇప్పుడదే ‘ఒక్క ఛాన్స్’తో పవన్ వస్తున్నారు. ఆయన విజయానికి అదే బాట వేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
-చంద్రబాబు ‘లాస్ట్ ఛాన్స్’ వర్కవుట్ అవుతుందా?
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. జగన్ రాజకీయాలకు గతంలోనే వలవలా మీడియా ముందర ఏడ్చేశారు. పవన్ తో పోలిస్తే ధీటుగా ధైర్యంగా జగన్ ను ఎదుర్కోవడంలో విఫలమైపోతున్నాడు.ఆయన వారసుడు లోకేష్దీన్ని అందిపుచ్చుకోవడం లేదు. ఇప్పటికే ఉమ్మడి ఏపీకి, అవిభాజ్య ఏపీకి సీఎం చేసిన చంద్రబాబు ప్రస్తుతం వయసు 72 ఏళ్లు. మరో ఐదేళ్లు మాత్రమే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయగలరు. అందుకే మీరు గెలిపిస్తే పాలిస్తా.. లేదంటే రాజకీయ సన్యాసం చేసుకుంటానంటూ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపారు. ప్రతిపక్షంలో పవన్ గట్టిగా పైకి రావడం.. ఆయన దూకుడును చంద్రబాబు ఓవర్ టేక్ చేయకపోవడంతో ఇదే తనకు ‘లాస్ట్ ఛాన్స్’ అని.. ప్రజలు ఇవ్వాలంటూ వేడుకుంటున్నాడు. నిన్న కర్నూలులో ఈ మేరకు ఈసారి గెలిస్తేనే ఉంటానని..లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు లాంటి పెద్దమనిషి అలా అడగడంతో ప్రజల్లోనూ కాస్తా కనికరం రావడం సహజమే. కానీ అది ఎంత వరకూ ఓటు బ్యాంకుగా మారుతుంది. పవన్ ను మించి చంద్రబాబును ప్రజలు ఆదరిస్తారా? అంటే డౌటే. ఎందుకంటే ఎన్నోసార్లు సీఎంగా చేసి.. ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు గురించి ప్రజలకు అంతా తెలుసు. అదే పవన్ పాలన ఇంతవరకూ చూడలేదు. సో కొత్త వారికి.. జగన్ ను బలంగా ఢీకొంటున్న పవన్ వైపే జనాలు మళ్లీ అవకాశం ఉంటుంది. చంద్రబాబు ‘లాస్ట్ ఛాన్స్’కు స్పందన చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
-జగన్ ‘మరో ఛాన్స్’ పనిచేస్తుందా?
తాజాగా విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో భేటి అయిన జగన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వాలని.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారం అని నమ్మకాన్ని వెలిబుచ్చారు. రాజకీయాలంటేనే ఒక్కరోజులో మారిపోతాయి. వైఎస్ మరణంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి రాష్ట్రాన్ని విడగొట్టాడు. వైఎస్ బతికున్నప్పుడు అసలు కేసీఆర్ పార్టీ లేదు.. ఉనికి కూడా లేదు. కానీ ఒకే ఒక ఆమరణ దీక్ష మలుపుతిప్పింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రాజకీయాల్లో 30 ఏళ్లు తనదేనన్న జగన్ ది అత్యాశే. చంద్రబాబు కూడా 2004లో విజన్ 2020 అన్నాడు. ఆ తర్వాత రెండు సార్లు ఓడిపోయాడు. తన పాలనపై జగన్ కు ఎక్కడా లేనంత నమ్మకం ఉంది. అందరూ ఓట్లేస్తారని భావిస్తున్నాడు. చంద్రబాబు వయసు అయిపోవడం.. 2024 ఎన్నికల తర్వాత ఆయన చురుగ్గా రాజకీయాలు చేయలేడని జగన్ భావిస్తున్నాడు. లోకేష్ తో జగన్ ను ఢికొట్టడం సాధ్యం కాదని భావిస్తున్నాడు.అందుకే 2024 లో గెలిస్తే ఇక చంద్రబాబు, ఇటు పవన్ వల్ల కాదని.. తనను ఓడించలేరని జగన్ ధీమాగా ఉన్నాడు. 30 ఏళ్ల కామెంట్ వెనుక కారణం ఇదేనంటున్నాడు. కానీ చంద్రబాబు పోయినా పవన్ వెంటాడుతున్నాడు. వేటాడుతున్నాడు. జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో రగిలిస్తున్నాడు. జగన్ పరిపాలన దారుణాలపై పోరాడుతున్నాడు. టీడీపీ కనుమరుగైన స్థానాల్లోనే జనసేనను బలంగా నిలుపుతున్నాడు. సో చంద్రబాబును తొలగిస్తే తన గెలుపు ఖాయమని భావిస్తున్న జగన్ కు దూసుకొస్తున్న పవన్ బలాన్ని అంచనావేయలేకపోతున్నారు.
సో ఈ ముగ్గురు ఎంత ధీమాగా ‘తమకే ఛాన్స్ ’ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా కూడా వారే అంతిమ నిర్ణేతలు. వారు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే గెలిపిస్తారు. ఓడించాలనుకుంటే ఎంత బాగా పాలించినా పరిపాలనతో సంబంధం లేకుండా ఓడిస్తారు. ప్రజలతో సంబంధం లేకుండా.. ప్రజల్లోకి వెళ్లి పోరాకుండా సీఎం పదవిపై ఆశలు పెట్టుకుంటే మాత్రం ఈ ముగ్గురికి మొదటికే మోసం వస్తుంది. చరిత్ర ఇదే చెబుతోంది. 3వేల కి.మీల పాదయాత్ర చేసి ప్రజలను వేడుకున్నందుకే జగన్ కు ‘ఒక్క ఛాన్స్’ఇచ్చారు ప్రజలు. అందుకే ప్రజల్లో పోరాడిన వారికే ఆ ‘ఒక్క ఛాన్స్ ’దక్కుతుంది. అది తెలిసే పవన్, చంద్రబాబులు జనాల వద్దకు వెళ్లి బతిమిలాడుతున్నారు. మరి వచ్చేసారి ఆ ‘ఒక్క ఛాన్స్’ ఎవరికి దక్కుతుందన్నది వేచి చూడాలి