
Tamma Reddy Vs Nagababu : తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ ఆర్ ఆర్ మూవీని ఆస్కార్ వరకూ తీసుకెళ్లేందుకు టీమ్ కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ నాగబాబుతో పాటు ఇండస్ట్రీ పెద్దలు రియాక్ట్ అయ్యారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ ఆర్ ఆర్ మూవీని ఉద్దేశిస్తూ కొన్ని అభ్యంతర కామెంట్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ తెచ్చేందుకు రూ. 80 కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బులతో ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొట్టొచ్చన్నారు. ఈ మాటలను పరిశ్రమ ప్రముఖులు తప్పుబట్టారు. సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు… ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ కోసం కోట్లు ఖర్చు చేయడం నువ్వు చూశావా? అకౌంట్స్ ఉన్నాయా? కామెరూన్, స్పీల్బర్గ్ వంటి దర్శకులు కూడా డబ్బులు తీసుకుని మన సినిమాను పొగిడారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు.
ఇక మెగా బ్రదర్ నాగబాబు ఆటం బాంబ్ లా పేలారు. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పేరు స్థావించకుండా నీయమ్మా మొగుడు ఖర్చు చేశాడా? అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అలాగే ఒక వీడియో బైట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.తెలుగు సినిమా ఆస్కార్ స్థాయి ఖ్యాతి ఆర్జిస్తుంటే ఆనంద పడాల్సింది పోయి ఈ నొచ్చుకునే గుణమెందుకు? ఓర్చుకోలేని తనమెందుకు? అన్నారు. ఆస్కార్ కి నామినేట్ కావడమే గొప్ప. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి, కీరవాణి కృషి ఫలితంగా తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డు కోసం డబ్బులు ఖర్చు చేశారని జర్నలిస్టుల రాశారంటే అర్థం ఉంది. పరిశ్రమకు చెందినవారై ఉండి, మీరు అలాంటి మాటలు మాట్లాడొచ్చా? అని సూటిగా ప్రశ్నించారు.
గతంలో కూడా మీరు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. నేను ఎందుకులే అని రియాక్ట్ కాలేదు. మా సహనం నశించి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ఇంకా అభాసుపాలవుతారని తీవ్రంగా హెచ్చరించారు. నాగబాబు కామెంట్స్ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండు గంటల నా స్పీచ్ లో ఒక నిమిషం తీసుకొని విమర్శలు చేయడం సరికాదని తమ్మారెడ్డి అన్నారు.
నేను చేసిన కామెంట్స్ తప్పైతే అది తప్పని చెప్పే హక్కు వాళ్లకు ఉంది. అయితే అమ్మానాన్నలను ఎత్తుతూ మాట్లాడటం బాధ పెట్టిందన్నారు. నాకు కూడా బూతులు వచ్చు సంస్కారం అడ్డొచ్చింది. మూడు రోజుల ముందు నేను ఆస్కార్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లిన రాజమౌళిని అభినందించాను. అప్పుడు ఎవరూ రియాక్ట్ కాలేదు. నేను ఈ వివాదం పొడిగించాలని అనుకోవడం లేదు. ప్రచారం కోసం ఇలాంటి పనులు చేయడం లేదని, మాట్లాడారు. నాగబాబు సెగ భరద్వాజకు బాగానే తగిలినట్లుందని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి. గతంలో మాదిరి ఇకపై తమ్మారెడ్డి భరద్వాజ్ తనకు సంబంధం లేని విషయాలు, వ్యక్తుల జోలికి వెళ్లకుండా సరైన శాస్తి జరిగిందంటున్నారు.