
Minister Appalaraju: ఇంట్లో ఎలుకలు దూరాయని ఇల్లు కాల్చేయ్యమన్నట్టుంది ఏపీలో కొంతమంది మంత్రుల దుస్థితి. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అప్పలరాజు చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఏపీలో పాలన ఏమంత బాగాలేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన చిన్న ప్రకటనకు బహుళ ప్రచారం వచ్చింది. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ పాలకులు తెగ బాధపడిపోయారు. మంత్రి అప్పలరాజు మీడియా ముందుకు వచ్చి తెగ మాట్లాడేశారు. హరీష్ రావు అభివృద్ధిపై విమర్శలు చేస్తే..అంతర్ రాష్ట్ర సమస్యగా అప్పలరాజు అభివర్ణించి స్థాయికి మించి కామెంట్స్ చేశారు.
విమర్శ పక్కదారి..
ఏపీలో అభివృద్ధి లేదు అన్న విమర్శకు స్పందించి ఉంటే సరిపోయేది. కానీ అప్పలరాజు అలా స్పందించలేదు. అసలు తెలంగాణలో ఏమీ లేదని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర ప్రజలు తిరిగి వచ్చేస్తే అక్కడ ఏమీ మిగలదని సెలవిచ్చారు. అంతటితో ఆగకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను ప్రాంతీయ ఉగ్రవాదులతో పోల్చారు. కేసీఆర్ కుటుంబాన్ని తాగుబోతుల కుటుంబంగా అభివర్ణించారు. అయితే అప్పలరాజు కామెంట్స్ వైరల్ అయ్యాయి. సీఎం కార్యాలయం తలంటినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అలా మందలించినట్టు లీకులిచ్చి ఉంటారన్న అనుమానాలున్నాయి. కేసీఆర్, జగన్ మధ్య స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.
ఆ సామర్ధ్యం ఏపీకి ఉందా?
పోనీ మంత్రి అప్పలరాజు అన్నట్టు తెలంగాణలోని సీమాంధ్రులు తిరిగి రీ బ్యాక్ అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించగల స్థితిలో ఏపీ సర్కారు ఉందా? వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నెలకొల్పిన పరిశ్రమలు ఎన్ని? అందులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎన్ని? ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ.. అభివృద్ధి అనేది కానరావడం లేదు. యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఏపీలోనే సీమాంధ్ర ప్రజలు తెలంగాణ వెళ్లి స్తిరపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకున్నారు. తెలంగాణ వేర్పాటు వాదం సమయంలో కూడా సీమాంధ్ర ప్రజలపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. కానీ అవన్నీ ఇప్పుడు సర్దుకున్నాయి. ఇటువంటి సమయంలో మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

ఎక్కడో అనుమానం?
అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంది. ఇద్దరు సీఎంల మధ్య సాన్నిహిత్యం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో తప్ప రాజకీయంగా ఇచ్చిపుచ్చుకుంటున్నారన్న అపవాదు కూడా ఇద్దరిపై ఉంది. అటువంటిది ఏపీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రులు వ్యూహాత్మకంగా విమర్శలకు దిగుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూను సైతం బీఆర్ఎస్ రేజ్ చేస్తోంది. అయితే ఇదంతా వ్యూహాత్మకంగా పనిగట్టుకొని చేస్తున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. లేకుంటే మంత్రి అప్పలరాజు లాంటి మంత్రి తెలంగాణ కేసీఆర్ కుటుంబాన్ని తాగుబోతులుగా, అవినీతిపరులుగా అభివర్ణించారంటే.. తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వారి తదుపరి వ్యూహం అమలు చేస్తే కానీ అసలు విషయం బయటపడే చాన్స్ కనిపించడం లేదు. చూద్దాం ఏం జరగుతుందో?