BRS KTR : ప్రశాంతంగా తెలంగాణ రాజకీయాలను చూసుకోకుండా కేసీఆర్ సార్ ఇంత అర్జంటుగా జాతీయ రాజకీయాలను దున్నేయాలని బయలు దేరడం వెనుక ఏదో ఒక మతలబు ఉంటుందని అందరికీ డౌట్ కొడుతోంది. ఇంట్లో కొడుకుపోరునో లేక నిజంగానే తెలంగాణలో సాధించినట్టే దేశంలోనే సాధిస్తానన్న నమ్మకమో కానీ కేసీఆర్ అడుగు ముందుకు వేశారు. జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. జాతీయ స్థాయిలో నేతలు కలిసి రాకున్నా.. కొందరు హ్యాండ్ ఇచ్చినా సరే బీఆర్ఎస్ ను ఢిల్లీలో లాంఛ్ చేశారు.

అయితే ఎవరూ వచ్చినా రాకున్న ఫరక్ పడేది కాదు.. కానీ టీఆర్ఎస్ కు కేసీఆర్ తర్వాత నంబర్ 2 అయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన కేటీఆర్ రాకపోవడమే అందరినీ షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ లో సమావేశాలు ఉన్నాయని.. అందుకే కేటీఆర్ పోలేదని గులాబీ దండు ఎంత కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ మాటలను నమ్మే స్థితిలో ఎవరూ లేరు.. కేసీఆర్ ‘బీఆర్ఎస్’ కార్యక్రమం అంటే అది ఆ పార్టీకి పండుగలాంటిది. ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన పార్టీని జాతీయస్థాయికి తీసుకెళ్లగలిగే బృహత్తర కార్యక్రమం. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాంలో కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు మంత్రి అయిన హరీష్ రావులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలందరూ హాజరయ్యారు. తెలంగాణ నుంచి వందలమంది టీఆర్ఎస్ నేతలు ఈ పార్టీ వేడుకకు హాజరయ్యేందుకు తరలివెళ్లారు. కానీ సొంత కొడుకు, మంత్రి కేటీఆర్ మాత్రం ఈ వేడుకకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో ముందే ఒప్పుకున్న ప్రోగ్రాంలు ఉన్నాయని కేటీఆర్ అన్నా కూడా అది సరైన కారణం కాదని.. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లకపోవడానికి బలమైన కారణమే ఉంటుందని తెలుస్తోంది. కేసీఆర్ లేని వేళ హైదరాబాద్ లో ఉండాల్సిన ఆవశ్యకతనా? లేక ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫెక్ట్ తోనే కేటీఆర్ వెళ్లలేదా? అన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బాంబు పేల్చారు. కేసీఆర్ కు ఇంటిపోరు మొదలైందని.. సీఎం కుర్చీ కోసం కొడుకు కేటీఆర్.. జాతీయ రాజకీయాలపై కూతురు కవిత లొల్లి భరించలేకనే కేసీఆర్ ఢిల్లీ బాటపట్టారని సంచలన ఆరోపణలు చేశారు. అనుకున్నట్టే ఆ పరిణామాలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ యే. టీఆర్ఎస్ కు అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేశాడు. అయినప్పటికీ పార్టీ పేరు మారి జాతీయస్థాయిలో విస్తరిస్తున్న వేళ కేటీఆర్ దూరంగా ఉండడం అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది.. హైదరాబాద్లో ఎంత ముఖ్యమైన పని ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకంటే ఏవీ ముఖ్యం కాదు. పైగా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ విషయంపై ఏదో అంతర్గత చర్చ నడుస్తోందని.. కేటీఆర్ ను తెలంగాణకు పరిమితం చేసి.. కవితను జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనుకుంటున్నారని.. అందుకే బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి కేటీఆర్ అలిగి దూరం జరిగారనే ప్రచారం సాగుతోంది.
గతంలోనే పార్టీ, ప్రభుత్వం పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విబేధాలొచ్చాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. కొంతకాలం పాటు టీఆర్ఎస్ అధికారిక పత్రికలో కవిత పేరు కూడా కనిపించలేదు. తర్వాత అంత సర్దుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా పెద్దగా ఘటనలకు బయటకు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ కూతురు కవితకు పెద్దపీట వేయడం.. జాతీయ రాజకీయాల్లో కవితకే ప్రాధాన్యతినిచ్చి కేటీఆర్ ను రాష్ట్రానికి పరిమితం చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేదని.. తనే కేసీఆర్ తర్వాత జాతీయస్థాయిలో ఉండాలని కేటీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి అందరూ వెళ్లినా కేటీఆర్ హాజరుకాకుండా గుర్రుగా ఉన్నాడని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇందులో వాస్తవముందో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ బీఆర్ఎస్ స్టెప్ మాత్రం ఆయనకు ఇంటిపోరు తెచ్చిపెట్టిందని.. కేటీఆర్ తెరచాటుకు వెళ్లడానికి కారణం అదేనని అంటున్నారు.