
ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. మరోవైపు రాష్ట్రంలో పోటీగా బలమైన బీజేపీ తరుముకొస్తున్న వేళ ఆగమేఘాలపై మీటింగ్ పెట్టేసిన కేసీఆర్ సార్ వీటిపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ముఖ్యంగా కూతురు కవిత అరెస్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యల్లో భయం కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు ఎన్నికలపై కూడా కేసీఆర్ తేల్చేశారు. కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లాల అధ్యక్షులతోపాటు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ను తనపక్కనే కూర్చుండబెట్టుకొని మరీ బీజేపీతో ఫైట్ పై ఎలా ముందుకెళ్లాలో దిశానిర్ధేశం చేశారు.
ఎన్నికలకు నేతలంతా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని .. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇక కవిత అరెస్ట్ పై కేసీఆర్ గుంభనంగా ఉన్నారు. ‘కవితను అరెస్ట్ చేస్తారట.. చేయనివ్వండి..ఏం చేస్తారో చూద్దాం.. భయపడే ప్రసక్తే లేదు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకూ వచ్చారు. నోటీసుల పేరుతో పార్టీ నేతలందర్నీ వేధిస్తున్నారు. కేంద్రంపై మా పోరాటం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని కేసీఆర్ సవాల్ చేశారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయలు దేరివెళ్లడం సంచలనమైంది. దీంతో కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ నుంచి గట్టి ప్రతిఘటనను కేంద్రానికి తెలిపేలా కార్యాచరణను కేసీఆర్ చేపట్టినట్టుగా అర్థమవుతోంది.