KCR : బిజెపిని గద్దె దించాలనే తలంపు తో కాంగ్రెస్.. ఎన్నికలకు ఏడాది ముందు ఉండగానే బలంగా అడుగులు వేస్తున్నది. 26 పార్టీలతో యూపీఏను అంతర్దానం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. ఇక దీనికి పోటీగా మోడీ 28 పార్టీలతో ఎన్డీఏ మీటింగ్ నిర్వహించాడు. అయితే దీనికి తెలుగు పార్టీల్లో కేవలం జనసేనను మాత్రమే పిలిచాడు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్, టిడిపిలు కూటమిలోనూ లేవు. కెసిఆర్ ను కూటమిలో ఎవరూ నమ్మరు. మహా అయితే బీజేపీ కెసిఆర్ ను ఇన్ డైరెక్ట్ గా వాడుకోగలదు. ఇక టిడిపికి ఎన్డీఏ ద్వారాలు ఇంతవరకూ తెరుచుకోలేదు. అటు వైసిపి కూడా అధికారికంగా కూటమిలో లేకపోయినప్పటికీ… అదీ ఒకరకంగా ఎన్డీఏలో భాగస్వామే. ఢిల్లీ ఆర్డినెన్స్ మీద బిజెపితో పోరాటానికి విపక్షం మద్దతు కోసం ఆప్ ఈ కూటమి మీటింగులోకి వస్తోంది. ఎన్నికలవేళ దాని వివరాలు దానికుంటాయి..
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ తో కలిసే ఛాన్స్ కనిపించడం లేదు. ఒకవేళ కలిస్తే అది బిజెపికి లాభం చేకూర్చుతుంది.. అయితే బిజెపికి భారత రాష్ట్ర సమితి బీ టీం అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ ప్రస్తుతానికి అంత క్లారిటీ కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ వర్సెస్ మాయావతి.. ఈ రెండు విపక్షాలు కలవడం కూడా అసాధ్యం. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆప్ తూర్పార పట్టింది. ఇదే పరిస్థితి కాశ్మీర్లో పిడిపి, ఎన్సీ రెండూ విపక్షాలే. వీటికి కూడా పరస్పరం గిట్టదు.
ఇక విపక్షాల భేటీ నేపథ్యంలో కెసిఆర్ మూడవ ఫ్రంట్ గాలికి కొట్టుకుపోయిన పేలపిండి అయిపోయింది.. అటు ఆర్థిక సహాయం చేసిన కుమారస్వామి కెసిఆర్ మూడవ ఫ్రంటును దేకడం లేదు. చెక్కులు ఇచ్చిన నితీష్ కుమార్ దూరం పెట్టాడు. అరవింద్ కేజ్రివాల్, భగవంత్ సింగ్ మాన్ ఇండియాలోనే మేముంటామని సంకేతాలు ఇచ్చారు.. ఫలితంగా కెసిఆర్ పరిస్థితి “నాకెవరూ లేరు నాతో ఎవరూ రారు” అనే పాటతీరుగా అయిపోయింది.
రాజకీయ నాయకుల్లో ఒక్కసారి ఏకాకిగా మిగిలిన కేసీఆర్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..