Pawan on Movies: తగ్గేదే లే అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా టికెట్ల విషయంలో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన పవన్ విరమణ సందర్భంగా వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. మద్యపాన నిషేధం, సినిమా టికెట్ల విషయంలో చీల్చిచెండాడాడు.

సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించి.. నా సినిమాలు ఆపేస్తే.. నా ఆర్థిక మూలాలపై దెబ్బకొడితే భయపడిపోతానని వైసీపీ వాళ్లు భావిస్తున్నారని.. కానీ అంత పంతానికి వస్తే ఏపీలో ఉచితంగా సినిమాలు ఆడిస్తానని.. భయపడే ప్రసక్తే లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విక్రయానికి పాదర్శకత లేదని ఆరోపిస్తున్న జగన్ సర్కార్ మద్యం విషయంలో అలా ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.
రూ.700తో మద్యం కొని రూ.5తో సినిమా చూడాలనడం ఏం న్యాయం అని జగన్ సర్కార్ తీరును పవన్ కడిగిపారేశారు. మద్యం విషయంలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పోల్చితే సినిమా టికెట్లు అసలు లెక్కలోకి రావన్నారు.
వైసీపీ నేతల రాక ఇష్టం లేకనే తిరుమలలో వేంకటేశ్వరస్వామి వర్షాలు కురిపించాడని.. కడప జిల్లాను తుడిచిపెట్టేశాడని పవన్ ఎద్దేవా చేశారు.