IT Attakcs on Cine Industry: విదేశాల నుంచి బ్లాక్ మనీని బయటకు తీసి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ సార్ 2014 ఎన్నికల్లో గద్దెనెక్కడానికి అతిపెద్ద హామీనిచ్చారు. అనైతికంగా సంపాదించిన ఎవ్వరినీ వదలమని స్పష్టం చేశారు. అయితే మోడీ గెలిచాడు. పేదల జన్ ధన్ ఖాతాలు తెరిచారు. కానీ ఒక్క రూపాయి వారి ఖాతాల్లో పడలేదు. ఇక పారిశ్రామికవేత్తలు మాత్రం వేల కోట్లు ఎగ్గొట్టి దేశం దాటి వెళ్లిపోయారు. వారిని ఏమీ చేయలేకపోయిన మోడీ సార్.. దేశంలో మాత్రం పన్నులు ఎగ్గొట్టే వారి పన్ను పీకేస్తున్నాడు. తాజాగా సినిమా పరిశ్రమపై పడ్డాడు. తమిళ సినీ ఇండస్ట్రీలో కోట్లు కొల్లగొడుతున్న వారి పీచమణిపించేలా పరిశ్రమ బ్లాక్ మనీని బయటకు తీస్తున్న మోడీ సార్. మోడీ సర్కార్ ధాటికి అక్రమ మణీ దాచిన వారి గుండెల్లో గుబులు రేగుతోంది.

ఆదాయపు పన్నుశాఖ ఇటీవల తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లల్లో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.200 కోట్ల బ్లాక్ మనీని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ఈనెల రెండోతేదీ నుంచి కలైపులి థాను, ఎస్ ఆర్ ప్రభు, అన్బుసెళియన్ తదితరుల కార్యాలయాల్లో మూడురోజులపాటు అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, మధురై, కోయంబత్తూరు లోని 40 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. రూ.26 కోట్ల నగదు, రూ.3 కోట్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటుగా రూ.200 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. లెక్కల్లో వెల్లడించని ఈ ఆదాయానికి సంబంధించిన కీలక పత్రాలు, డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు గుర్తించారు. థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసి వాటిని కూడా లెక్కల్లో చూపించలేదని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అన్బుసెళియన్ పై అధికారులు దృష్టి సారించారు. ఆయనకు చెందిన పలు ప్రాంతాల్లోని కార్యాలయాలపై సోదాలు జరిగాయి. బంధువులు, సన్నిహితుల నివాసాల్లో కూడా సోదించారు. ఆయన నిర్మించిన కబాలి, అసురన్, కర్ణన్ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. సూర్య బంధువైన మరో నిర్మాత ఎస్ ఆర్ ప్రభు గతంలో కార్తి నటించిన ఖైదీ, సూర్య నటించిన ఎన్ జీకే సినిమాలను నిర్మించారు.
తమిళ సినీ ఇండస్ట్రీపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల కలవరం చూసి మిగతా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. టాలీవుడ్ లో కూడా దాడులు జరుగుతాయా? అని నిర్మాతలు హడలి చస్తున్న పరిస్థితి నెలకొంది.