SAFF Championship 2023: భారత ఫుట్ బాల్ జట్టు అద్వితీయమైన ఆటతీరుతో శాఫ్ ఛాంపియన్ గా మరోసారి నిలిచింది. భారత జట్టు బెంగుళూరు వేదికగా కువైట్ తో జరిగిన ఫైనల్ పోరులో షూటౌట్ లో 5-4 తో నెగ్గి టైటిల్ ను కాపాడుకుంది. ఈ ఫైనల్ విజయంతో తొమ్మిదో సారి భారత్ శాఫ్ టైటిల్ ను కైవసం చేసుకున్నట్లు అయింది. అత్యంత ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత జట్టును విజయం వరించింది. ఈ విజయంతో భారత జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
భారత ఫుట్ బాల్ జట్టు అదరగొట్టింది. బెంగళూరులో జరిగిన శాఫ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో మ్యాచ్ లో కువైట్ తో భారత్ తలపడింది. హోరాహోరీగా పోరాడి భారత్ జట్టు విజయం దక్కించుకుంది. భారత్ గోల్ కీపర్ గుర్ ప్రీత్ సింగ్ సంధు మరోసారి హీరోగా నిలిచి ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుకు అపూర్వమైన విజయాన్ని అందించి పెట్టాడు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ పోరులో నిర్ణీత సమయంలో స్కోర్ 1-1 సమం కాగా, అదనపు సమయంలోను గోల్ నమోదు కాలేదు. దీంతో పెనాల్టీ షూట్ అవుట్ అనివార్యమైంది. ఇక్కడ ఇరు జట్లు నువ్వా నేనా అనే రీతిలో పోరు సాగించడంతో తొలి ఐదు రౌండ్లలో 4-4 గోల్స్ తో సమానంగా నిలిచాయి. ఈ దశలో ఫలితం కోసం సడన్ డెత్ కు వెళ్ళగా.. ముందు భారత్ నుంచి మహేష్ కీలక గోల్ చేశారు. కువైట్ కెప్టెన్ ఖాలెద్ ప్రయత్నాన్ని కీపర్ గుర్ ప్రీత్ అడ్డుకోవడంతో భారత్ సంబరాల్లో మునిగిపోయింది.
తొమ్మిదో సారి టైటిల్ కైవసం చేసుకున్న భారత జట్టు..
తాజా విజయంతో భారత జట్టు తొమ్మిదో సారి శాఫ్ టైటిల్ కైవసం చేసుకున్నట్టు అయింది. గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021 లోను భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఈ టోర్నీలో రెండోసారి భారత్, కువైట్ జట్లు పోటీ పడ్డాయి. గ్రూపు మ్యాచ్ లో భారత్ కు కువైట్ జట్టు గట్టి పోటీ ఇవ్వడంతో ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపించింది. ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో కువైట్ ఆటగాళ్లు జోరు మీద కనిపించారు. మ్యాచ్ ప్రారంభమైన 14వ నిమిషంలోనే కువైట్ ఆటగాడు ఆల్ ఖల్ది గోల్డ్ చేయడంతో కువైట్ జట్టు 1-0 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. వెంటనే పుంజుకున్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై దాడులకు దిగింది. అయితే 17వ నిమిషంలో చాంగ్తే ప్రయత్నం విఫలమైంది. 22వ నిమిషంలో సాహాల్ పాల్ కారణంగా కువైట్ కు అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు భారత్ గోల్ ఎదురుచూపులకు 38 నిమిషములో తెరపడింది. సునీల్ చెత్రి నుంచి పాస్ ను పెనాల్టీ బాక్స్ లో అందుకున్న సాహాల్ నేరుగా దాన్ని చాంగ్తేకు అందించాడు. అతను పొరపాటుకు తావీయకుండా జట్టుకు తొలి గోల్ అందించి స్కోరును 1-1 తో సమం చేశాడు. తర్వాతి నిమిషంలోనే భారత్ కు మరో ఛాన్స్ లభించిన కురునియన్ హెడర్ గురి తప్పింది. ద్వితీయార్థంలో ఇరుజట్ల నుంచి పలు గోల్స్ అవకాశాలు వృధా కావడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళింది. అక్కడ కూడా రెండు జట్ల ఆటగాళ్లు ఏమాత్రం తగ్గకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ అవుట్ కు వెళ్ళగా, అక్కడ ఫలితం వచ్చింది.
భారత జట్టుకు రూ.41 రూపాయల ప్రైజ్ మనీ..
ఈ టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.41 లక్షల రూపాయలు ప్రైజ్ మనీని అందించారు. రన్నరప్ నిలిచిన కువైట్ జట్టుకు రూ.20.5 లక్షలు అందించారు. సునీల్ చెత్రి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ సొంతం చేసుకున్నాడు. నేపాల్ జట్టు ఫెయిర్ ప్లే అవార్డు దక్కించుకోగా, బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద కాంపిటేషన్ అవార్డును బంగ్లాదేశ్ కు చెందిన అనిసూర్ రేష్మాన్ దక్కించుకున్నారు.