పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది పాలను తాగడానికి ఇష్టపడతారు. పాల ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. సరైన మోతాదులో పాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. పాలలో 95 శాతం నీటి పరిమాణం ఉంటుంది. రోజూ పాలు తాగితే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎసిడిటీ సమస్యలను తగ్గించడంలో పాలు సహాయపడతాయి.
అయితే చాలామంది అవసరాలకు మించి పాలను కొనుగోలు చేస్తే పాలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కొన్నిసార్లు పాలను ఫ్రిజ్ లో పెడితే పాలు గడ్డ కడుతుంటాయి. గడ్డ కట్టిన పాలను వినియోగించవచ్చా..? వినియోగించకూడదా..? అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. పాల ప్యాకెట్ ను తెరిచిన తరువాత ఫ్రిజ్ లో ఉంచితే నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వినియోగించాలి.
అంతకంటే ఎక్కువ సమయం ఉంచితే మాత్రం ఆ పాలు వినియోగించుకోవడానికి ఉపయోగపడవు. పాల ప్యాకెట్ ను ఓపెన్ చేయకపోతే ఎక్స్ పైరీ డేట్ ను బట్టి పాల ప్యాకెట్ ను వినియోగించుకోవచ్చు. పాలను ఫ్రిజ్ లో పెట్టిన సమయంలో పాత్రలో 1 నుంచి 1.5 అంగుళాల గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడాలి. పాలు నిండుగా ఉండటం వల్ల విరిగిపోయే అవకాశం ఉంటుంది. గాలి చొరబడని కంటైనర్ లో మాత్రమే పాలను ఫ్రిజ్ లో పెట్టాలి.
గడ్డకట్టిన పాలను కరిగించాలంటే ఫ్రిజ్ లోనే కరిగించాలి. సాధారణ ఉష్ణోగ్రతలో పాలలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. చల్లటి నీటిలో ఉంచి కూడా గడ్డకట్టిన పాలను త్వరగా కరిగించవచ్చు. అయితే ఆహార నిపుణులు ఘనీభవించి, కరిగించిన పాలు తాగడానికి మంచివి కావని చెబుతున్నారు.