Pawan vs YCP : ఏపీలో ఫ్లెక్సీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైసీపీ, జనసేనలు హీటెక్కిస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడుస్తున్న వేళ వైసీపీ ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేసింది. దానికి కౌంటర్ గా జనసేన పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలులో అయితే జనసేన నేతలపై వైసీపీ వర్గాలు దాడికి ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
తొలుత ఒంగోలులో టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలో చంద్రబాబు పల్లకిని పవన్‌కళ్యాణ్ మోస్తున్నట్టు చిత్రీకరిస్తూ బ్యానర్లు వేసింది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అనే కొటేషన్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. దీనికి జనసేన శ్రేణులు వెంటనే కౌంటర్ అటాక్ చేశాయి. రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ఆరంభం.. అంటూ ఫ్లెక్సీలు వేశారు జనసేన కార్యకర్తలు. దీంతో వివాదం ముదిరింది. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. జనసేన శ్రేణులపై దాడికి ప్రయత్నించాయి. అయితే ఒక్క ఒంగోలులోనే కాదు.. విశాఖ, నెల్లూరు జిల్లా నాయుడుపేట, పాలకొల్లులో జనసేన శ్రేణులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశాయి.

ఒంగోలులో జనసేన ఏర్పాటు చేసిన కౌంటర్ ఫ్లెక్సీలను కొందరు తొలగించారు. అది వైసీపీ నేతల పనేనంటూ జన సైనికులు ఆరోపించారు.ఒంగోలు భారీగా ఆందోళనకు దిగారు. వైసీపీ బ్యానర్లను అలాగే ఉంచి జనసేన ఫ్లెక్సీలను మాత్రమే మునిసిపల్ సిబ్బంది, పోలీసులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. జనసైనికులు. మున్సిపల్ సిబ్బంది, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పాలకొల్లులో వైసీపీ, -జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతొంది. పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయంటూ జనసేన నాయకులు ఆందోళన దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పొత్తులపై పవన్ కళ్యాణ్ సానుకూల ప్రకటన నాటి నుంచే జనసేనపై ఎదురుదాడి ప్రారంభమైంది. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ శ్రేణులు సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీ వార్ కు వైసీపీ దిగింది. దీనిపై జనసేన నేతలు వెనక్కి తగ్గడం లేదు. కౌంటర్ అటాక్ చేస్తుండడంతో ఎక్కడికక్కడే వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. మున్ముందు ఫ్లెక్సీ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.