Time Travel Movies: ఓటీటీలు వచ్చాక.. ప్రేక్షకుల అభిరుచి మారింది. రొడ్డ కొట్టుడు సినిమాలను చూసే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద హీరోలు, కోట్ల కొద్దీ బడ్జెట్ తో నిర్మిస్తున్నా దేకటం లేదు. అందుకే వర్ధమాన దర్శకులు కొత్త తరహా కథలతో ముందుకు వస్తున్నారు. అందులో మెజారిటీ శాతం విజయాలను దక్కించుకుంటున్నారు. అందరూ రకరకాల జోనర్లను ట్రై చేస్తున్నారు. కానీ వీటిలో ఎపిక్ జోనర్ అయిన టైం ట్రావెల్ తో ఇటీవల కొంత మంది సినిమాలు తీశారు. కథ, కథనాలు వేటికవే భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి. అప్పుడెప్పుడో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సినిమా వచ్చిన తర్వాత తెలుగులో టైమ్ ట్రావెల్ కథాంశంతో సినిమాలు రావడానికి చాలా సమయమే పట్టింది. అయితే టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్, బోలెడంత బడ్జెట్ తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైం ట్రావెల్ కథలతో సినిమాలు తీశారు. ఆదిత్య 369 నుంచి మొన్న రిలీజ్ అయిన ఒకే ఒక జీవితం వరకు తెలుగులో చాలా వరకే టైం ట్రావెల్ చిత్రాలు వచ్చాయి.

ఆదిత్య 369
నందమూరి బాలకృష్ణ ద్వి పాత్రాభినయం చేసిన ఆదిత్య 369 తెలుగులోనే తొలి ట్రావెల్ సినిమా. ఇందులో కృష్ణకుమార్ గా, శ్రీకృష్ణదేవరాయులుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టిన సంగతి తెలిసిందే. 1991 ఆగస్టు 18న విడుదలైన ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. హెచ్ జి వేల్స్ రాసిన “టైం మిషన్” పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే బాలకృష్ణ కుమారుడితో ఆదిత్య 369 సినిమాకి పార్ట్ 2 తీస్తారని సమాచారం.

24
తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభిన్న పాత్రలతో మెప్పించిన సినిమా 24. సినిమాను విభిన్న చిత్రాల దర్శకుడు కె విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వాచ్ రిపేరర్ గా, శాస్త్రవేత్తగా, విలన్ గా సూర్య నటించిన తీరు అనన్య సామాన్యం. ఇందులో వాచ్ రూపంలో టైం మిషన్ ఉంటుంది. ఆ వాచ్ ను రిపేర్ చేసే క్రమంలో ఆ టైం మిషన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేస్తాయి.

ప్లే బ్యాక్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర పనిచేసిన హరిప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే ప్లే బ్యాక్ సినిమా. సినిమాలో దినేష్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బతికి ఉంటే.. మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైం గ్యాప్ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటి? ఫోన్ కాల్స్ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో అని తెలిపేదే ఈ కథ.

అద్భుతం
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఇద్దరు యువతీ యువకులు ఒక ఫోన్ కాల్ ద్వారా విరమించుకుంటారు. అయితే ఈ ఇద్దరికీ ఒకే మొబైల్ నెంబర్ తో ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆచార్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్ళిద్దరూ వేరువేరు సంవత్సరాల లో జీవిస్తున్నారని చెబుతుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ సినిమాకు, అద్భుతం సినిమా కథ ఒకేలా అనిపిస్తుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ సినిమాలో 26 సంవత్సరాల టైం గ్యాప్ ఉంటే.. ఇందులో ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది.

ఆ
నేచురల్ స్టార్ నాని స్వీయ నిర్మాణంలో.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ ఇందులో నటించారు. పూర్తి టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో శివ అనే పాత్రధారి సైంటిస్ట్ కావాలి అనుకుంటాడు. అలా సైంటిస్ట్ అయ్యి టైం మిషన్ ను కనుగొంటాడు. ఆ మిషన్ ద్వారా ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలి అని అనుకుంటాడు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో పార్వతి అనే పాత్ర వస్తుంది. ఆ తర్వాత జరిగే మలుపులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా చివర్లో పార్వతికి, శివకు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది సినిమాల్లో బెస్ట్ ట్విస్ట్.
కుడి ఎడమైతే
టైం ట్రావెల్ జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ ఇది. అమలాపాల్, ఈశ్వర్, రాహుల్ నటించిన ఈ వెబ్ సిరీస్ లో టైం లూప్ గురించి బాగా వివరించారు. ఒకే సమయంలో సినిమా ఆగిపోవడం.. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు పునరావృతం అవుతుంటాయి. మల్టిపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథ.. ప్రేక్షకుల మెదడుకు పని పెడుతుంది.

ఒకే ఒక జీవితం
ఆరు ఫ్లాప్ ల తర్వాత శర్వానంద్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. మూడు వరుస హిట్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం ఇది. డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మాణంలో.. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అమల, నాజర్, మురళి శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా.. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతుంది. శ్రీ కార్తిక్ కు ఈ సినిమా డెబ్యూ అంటే నమ్మలేం. ఎందుకంటే అంత గొప్పగా తీశాడు మరి. ఇప్పటివరకు వచ్చిన టైం ట్రావెల్ సినిమాల్లో కేవలం సైన్స్ ఎక్స్పోజర్ మాత్రమే ఉంది. కానీ ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. బంధాల్లోని గాఢత ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా మరింత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇవే కాక తమిళంలో గత ఏడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా, ఎస్ జె సూర్య విలన్ గా వచ్చిన మానాడు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఒకరకంగా చెప్పాలంటే టైం లూప్ నేపథ్యంలో ప్రేక్షకుల మెదడుకు పదును పెట్టింది.
