BJP Etela Bandi Sanjay : తెలంగాణలో బీజేపీలో ఏదో జరుగుతోంది? ఏంటన్నది బయటపడడం లేదు. కానీ టీఆర్ఎస్ ను ఓడించేందుకు.. బీజేపీ నేతలను కాపాడుకునేందుకు.. బలంగా తీర్చిదిద్దేందుకు ఏదో కసరత్తు జరుగుతోంది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే ప్లాన్ అయితే ఇది కాదని బీజేపీ అధిష్టానం ఓ అంచనాకు వచ్చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో విఫలమైనట్టు బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకుంటోంది. బీజేపీ నేతలపై కేసీఆర్ వేసిన ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా తిప్పి కొట్టాలని భావిస్తోంది. ఢిల్లీలో ఈ మేరకు నిన్న ఈటల రాజేందర్ ను రప్పించిన అధిష్టానం.. ఇప్పుడు బండి సంజయ్ ను పిలిపించి తెలంగాణ నేతలకు దిశానిర్ధేశం చేస్తోంది.

-సీనియర్ ఈటల సేవలు అవసరం..
తెలంగాణ బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చిన అధిష్టానం.. ఆయన ద్వారా గులాబీ గూటిలోని అసంతృప్తులను లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎలాగైతే బీజేపీ నుంచి నేతలను ఘర్ వాపసీ చేస్తున్నాడో.. అలానే ఈటలతో ఉద్యమకారులను బీజేపీలోకి చేర్చే కీలక ఆపరేషన్ ను ఈటలకు అప్పగించినట్టు సమాచారం. ఇటీవల కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఈటలకు ఆఫర్ ఇచ్చారని.. డిప్యూటీ సీఎం పదవితోపాటు చాలా మంచి అవకాశాలు ఇచ్చారని టీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారని తప్పుడు ప్రచారం చేశారు. ఇలాంటి వాటిని తిప్పి కొట్టడానికే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు ఈటల. అంతగా అవమానించిన కేసీఆర్ ను.. టీఆర్ఎస్ ను వదిలిపెట్టకూడదని ఈటల బలంగా నిశ్చయించుకున్నారు. అందుకే ఆ ఊహాగానాలకు తెరదించుతూ బీజేపీలోనే కసిగా పనిచేయాలని చూస్తున్నారు. అందుకే ఈటల లాంటి సీనియర్ సేవలను వాడుకోవాలని బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. బండి సంజయ్ కంటే కూడా రాజకీయాల్లో సీనియర్ అయిన ఈటల సేవలను ఉపయోగించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
-బండి సంజయ్ కు దిశానిర్ధేశం.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే బండి సంజయ్ దూకుడుతోపాటు.. ఈటల రాజేందర్ అనుభవం ఉపయోగపడుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. కేసీఆర్ ను దెబ్బకొట్టాలంటే బలమైన నేతలు అవసరం అని.. అందరినీ కలుపుకొని పోయేలా బండి సంజయ్ కు బీజేపీ అధిష్టానం దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం.
-బీజేపీపై టీఆర్ఎస్ కుట్రలు ఛేదించాలి..
బండి సంజయ్ ను తొలగిస్తున్నారని.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లోకి వెళుతున్నారంటూ ప్రచారం చేసి బీజేపీ నేతల ఆత్మస్తైర్యం దెబ్బతీసే కుట్రలను టీఆర్ఎస్ బ్యాచ్ చేస్తోంది. మీడియాలో ఊదరగొడుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఐక్యపోరాటాలు చేయాలని.. ఐక్యంగా కలిసి పనిచేసి విలేకరుల సమావేశాల్లోనూ ఐక్యత చాటాలని బీజేపీ అధిష్టానం బీజేపీ సీనియర్లకు చెప్పినట్టు తెలిసింది. బీజేపీని చీల్చే కేసీఆర్ ఎత్తుగడలను తిప్పి కొట్టి.. అసంతృప్తిగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకొని బలపడే ప్లాన్ బిని అమలు చేయాలని యోచిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ఎంత క్యాష్ చేసుకుంటే బీజేపీ గెలుపునకు అంత మంచిది. ఇంతేకాదు.. బలమైన నేతలను నియోజకవర్గ వారీగా తయారు చేయడం అవసరం. లేదంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి వలసలను ప్రోత్సహించాలి. ఇప్పుడే ఇదే ప్లాన్ తో తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ మేరకు బండి సంజయ్, ఈటల, డీకే అరుణ లాంటి సీనియర్లకు దిశానిర్ధేశం చేస్తోంది. వచ్చే సారి అధికారమే లక్ష్యంగా సాగుతోంది.