Tollywood Jagan: మూడు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ను కలవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఇండస్ట్రీ ఊహించినంత సానుకూలత ఏపీ సీఎం నుంచి ఇప్పుడే రాకపోయినా.. మున్ముందు మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశాలు లేకపోలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఏపీ సీఎంను కలవడంపైనే ఇప్పుడు చర్చ అంతా..

ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేయొద్దని జీవో జారీ చేసింది. సినీ పరిశ్రమ జగన్ కు మోకరిల్లలేదని, టాలీవుడ్ అంతా టీడీపీ క్యాంపు గానే భావిస్తూ తమను ఇబ్బందులు పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు వచ్చాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ తతంగం నడుస్తున్నా పెద్దగా ఎవరూ బయటికి రాలేదు. కానీ గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ముందు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంతో కలెక్షన్ల పరంగా చాలా డ్యామేజ్ జరిగింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ తెర మీదకు రావడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. తమ అభిమాన హీరో రీ ఎంట్రీతో కలెక్షన్లలో రికార్డులు తిరగరాస్తాడని భావించారు. కానీ జగన్ రూపంలో వారి ఆశలకు అడ్డుకట్ట పడింది.
-ప్రస్తుతానికి దూకుడు తగ్గించుకున్న పవర్ స్టార్
సినిమా రిలీజైన కొద్ది రోజులకే దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరగడంతో భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలూ వాయిదా పడ్డాయి. మరికొన్ని ఓటీటీ బాట పట్టాయి. ఎలాగూ సినిమాలు విడుదల చేసేపరిస్థితులు లేకపోవడంతో టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతలు, హీరోలు జగన్ నిర్ణయాన్ని లైట్ గా తీసుకున్నారు. ఈ వైఖరే జగన్ లో మరింత అసహనాన్ని పెంచిందని పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. అదే సమయంలో అవకాశం చిక్కినప్పుడల్లా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యా్ణ్ మాత్రం ఏపీ అధికార పార్టీపై విరుచుకు పడ్డాడు. ఏపీ సీఎం జగన్, వైసీపీ నాయకులు తన ఒక్కడిని టార్గెట్ చేసి సినిమా ఇండస్ర్టీనే తొక్కేయాలని చూస్తున్నారని పలు రాజకీయ పార్టీల వేదికల్లో, సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో పరస్పర విమర్శలు ప్రెస్ మీట్లతో పాటు ట్విట్టర్ లోనూ సాగాయి. ఈ రచ్చంతా దాదాపు డిసెంబర్ వరకు పవన్ కల్యాణ్ వన్ మెన్ షోగానే నడిచింది. డిసెంబర్ నుంచి అఖండ, పుష్ప సినిమాల రిలీజ్ నుంచి నిర్మాతల్లో కొంత ఆందోళన మొదలైంది. రేట్ల తగ్గింపు, అదనపు షోలు, బెన్ఫిట్ షోల రద్దుతో పెద్ద సినిమాలకు దెబ్బ తప్పదని నిర్మాతల్లో గుబులు మొదలైంది. బాలక`ష్ణ అఖండ సినిమా ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లను సీజ్ చేయడంతో నిర్మాతల్లో మరింత భయానికి గురి చేశాయి. ఉన్న రేట్లతో డబ్బులు రాబట్టుకోలేం. అలాగని ఉన్న ఫలంగా ఏపీ సీఎం దగ్గరికి వెళ్లేది ఎలా అని పలువురు నిర్మాతలు భావించారు. ఇక సీనియర్ హీరో నాగార్జున ఈ విషయంలో కొద్ది రోజుల పాటు తటస్థంగానే ఉండిపోయాడు. తన సినిమా రిలీజ్ టైం లో ఈ గొడవ నాకెందని నేరుగా చేతులెత్తేశాడు. డిసెంబర్ చివరి వారంలో శ్యాం సింగరాయ్ విడుదలకు ముందు హీరో నాని నోరు విప్పాడు. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉండగా కేవలం సినిమాల మీద పడడం ఏంటని మండిపడ్డారు. ఒక వైపు పెద్ద సినిమాల రిలీజ్లు దగ్గర పడడం, కరోనా కేసులు పెరుగుతుండడం తో మళ్లీ అనిశ్చితి మొదలైంది. సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఈ గ్యాప్ ను ఎలాగైనా సరిచేసుకొని భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పలువురు భావించారు.
-అందరివాడినని అనిపించుకుంటున్న మెగాస్టార్..
ఈ క్రమంలో మెగా స్టార్ చిరంజీవిని ముందు పెట్టారు. చిరంజీవితో ఈ సమస్య పరిష్కారమవుతుందా అని సందేహించారు. ఇటీవల ఓసారి జగన్ ను చిరంజీవి కలిసినా ఏ ప్రయోజనమూ లేదు. ఇక పవన్ కల్యాణ్ వల్ల తమకూ కొంత ఇబ్బందేనని పలువురు నిర్మాతలు భావించారు. కానీ ఈ సమయంలో పవన్ కల్యాన్ వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. తన వల్ల ఇతరులకు ఇబ్బందులు రాకుండా ఉండాలని భావించాడో లేక తన సినిమాతో పాటు తన అన్న కొడుకు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఉన్నాయని వెనుకడుగు వేశాడోనని పలువురు పేర్కొంటున్నారు. ఏ ఇంటి నుంచి అయితే తనకు కత్తి విసురుతున్నారో అదే ఇంటి నుంచి కాంప్రమైజ్ ధోరణితో చిరంజీవి రావడం జగన్ ను కొంత నెమ్మదించేలా చేసింది. జగన్ దగ్గరకు చిరంజీవి వెళ్లడం పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులకు నచ్చని విషయం. కానీ చిరంజీవి తనకున్న సామరస్య పూర్వక ధోరణితో వివాదానికి ముగింపు పలకడం టాలీవుడ్ కు కొంత శుభపరిణామమే కావచ్చు.
-అన్నదమ్ముళ్ల మధ్య వార్ నిజమేనా..?
అయితే సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఏపీ సీఎంను కలవడంతో అన్నదమ్ముళ్ల మధ్య అంతర్గత వార్ నడుస్తుందని పలువురు భావిస్తున్నారు. కానీ వారి సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే అన్నదమ్ముళ్ల మధ్య వార్ అనేది భ్రమేనని, వారిద్దరి మధ్య ఎటువంటి కోపతాపాలు ఉండవని చెబుతున్నారు. కొన్ని వందల కోట్లతో తీసిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో తన దూకుడు మంచిది కాదని పవన్ భావిస్తున్నారు. రెండోది మా అసోసియేషన్ ప్రస్తుతం మంచు ఫ్యామిలీ లో గుప్పిట్లో ఉంది. ఎలక్షన్లలో గెలిచినా మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిందేమీ లేదు. తమ ఓటమిని మరో గెలుపునకు ఇదొక అవకాశంగా భావిస్తున్నది చిరంజీవి క్యాంప్. టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో మోహన్ బాబు కానీ, విష్ణు కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రయత్నమూ చేయలేదు. దీనిని చిరంజీవి, పవన్ కల్యాణ్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సినీ పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా తాను ముందుంటాననే భావనను చిరంజీవి కల్పిస్తున్నారు. తమ్ముడు తగ్గినట్లు కనిపిస్తుండగా, అన్న తాను అందరివాడినని ఎక్స్ పోజ్ అవుతున్నాడు. ఇందులో చిరంజీవి వ్యక్తిగత స్వార్థం కూడా ఉన్నా ఇండస్టీ కోసం ముందుంటాడనే వాదనే కనిపించేలా చేస్తున్నాడు. తన కొడుకు రాం చరణ్ నటించిన పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్, కొడుకు కాంబినేషన్ లో ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు చిరంజీవికి కలిసి వచ్చింది. ఒకటి తమ సినిమాలతో పాటు మిగతా సినిమాల రిలీజ్ కు ఇబ్బందులు లేకుండా చూడడం, రెండోది మోహన్ బాబు నుంచి పరిశ్రమను తన వైపునకు తిప్పుకోవడం చిరంజీవి ముందుపడడానికి కారణంగా చెప్పొచ్చు.
-జగన్ దిగి రాక తప్పదా..?
సినిమా టికెట్లరేట్ల తగ్గింపుతో సినీ పరిశ్రమ తన గుప్పిట్లో ఉంటుందని ఏపీ సీఎం భావించినా అదే తప్పని తెలుసుకున్నాడు. ఏపీలో సినిమాలు చూసే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. పెద్ద హీరోల సినిమాల రిలీజ్ లను పండుగలా భావిస్తారు. తమ హీరో గొప్పంటే.. తమ హీరోనే గొప్ప అనే వాదనలు ఉంటాయి. కేవలం పవన్ కల్యాణ్ ను దెబ్బతీయడానికే ఏపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లింది. మద్యం రేట్లు పెంచి, సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం ఎంటనే పరిస్థితులు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లు, ప్రెస్ మీట్లు, మంత్రిని కలవడం జగన్ పై మరింత వ్యతిరేకతను పెంచాయి. ఈ సమయంలో సినిమా వాళ్లను నేరుగా పిలవలేడు.. అలాగని తగ్గలేడు. ఈ సందర్భాన్ని మెగాస్టార్ చాలా చక్కగా వినియోగించుకొని తాను అందరి వాడినని అనిపించుకున్నాడు. మరీ ఒక్కసారి మీటింగ్ కే మెత్త బడితే ఎలా..అని మరోసారి మీటింగ్ అరెంజ్ చేసేలా చూసుకున్నాడు ఏపీ సీఎం జగన్. రెండో మీటింగ్ ఇద్దరు పెద్ద దర్శకులతోపాటు టాప్ హీరోలు మహేశ్, ప్రభాస్ కూడా ఉండేలా చూసుకున్నాడు. కొంత వెసులు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించాడు. మున్మందు మరింత మేలు చేకూరుస్తాననే భరోసా కల్పించాడు. సినీ పరిశ్రమను విశాఖ తరలిస్తే మరిన్ని రాయితీలు ప్రటిస్తానని పరోక్షంగా చెబుతున్నాడు. మొత్తంగా అన్న చిరు సామరస్యంగా వెళితే..తమ్ముడు పవన్ మంటపెట్టినా కాస్త తగ్గి ప్రవర్తిస్తున్నాడు. ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి జగన్ వ్యతిరేక, అనుకూల శక్తులుగా పనిచేయడం విశేషమే మరీ..
[…] Also Read: పవన్ కళ్యాణ్, చిరంజీవి: కత్తి దూసేది ఒ… […]
[…] Also Read: పవన్ కళ్యాణ్, చిరంజీవి: కత్తి దూసేది ఒ… […]
[…] Also Read: పవన్ కళ్యాణ్, చిరంజీవి: కత్తి దూసేది ఒ… […]