Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి చప్పగా సాగుతోందని.. ఎవరూ ఆడడం లేదని ఓసారి నాగార్జున హెచ్చరించాడు. అనంతరం ఓ టాస్కే బాగా చేయడం లేదని రద్దు చేసి హౌస్ మేట్స్ అందరినీ ఆకలితో పస్తులు ఉంచాడు బిగ్ బాస్. అయితే ఇదంతా గుర్తుకు తెచ్చుకున్నారో ఏమో కానీ ఈ మంగళవారం బిగ్ బాస్ లో రణరంగమే చోటుచేసుకుంది. రచ్చరచ్చస్య రచ్చోయ్యభహ అన్నట్టుగా ఇంటి సభ్యులంతా కూడా రెచ్చిపోయాడు. టాస్క్ కోసం కొట్టుకుచచ్చారు.

బిగ్ బాస్ లో ఎన్నడూ చూడని వింతలు చోటుచేసుకున్నాయి. హౌస్ లోనే డేరింగ్ డ్యాషింగ్ అంటూ అందరినీ తిట్టిపోసే లేడీ పుష్ప గీతూ తొలిసారి ఆటలో సరిగ్గా ఆడలేక ఏడ్చేసింది. చేపల టాస్క్ పేరుతో ఇంటి సభ్యులను బిగ్ బాస్ జంటలుగా విడదీసి ఇచ్చిన ఈ టాస్క్ రణరంగాన్నే సృష్టించింది. ఆకాశం నుంచి చేపలు పడడం.. వాటిని హౌస్ మేట్స్ పట్టుకొని బుట్టల్లో దాచుకోవడం టాస్క్ గా ఇచ్చాడు.
దీంతో ఈ చేపల వర్షం పడుతుంటే వాటిని పట్టుకోవడానికి హౌస్ మేట్స్ ప్రాణాలకు తెగించారనే చెప్పాలి. ఇక బుట్టలో దాచుకున్న చేపలను ఒకరివి ఒకరు లాక్కోవడం.. దొంగిలించడం ఇలా రచ్చరచ్చ జరిగింది. గీతూ వేరే వాళ్ల బుట్టలోంచి తిరిగి తీయడం మొదలుపెట్టగానే అందరూ వచ్చి ఆమె బుట్టలోనే చేపలను ఎత్తుకెళ్లారు. దీంతో అందరి బుట్టలపై పడి గీతూ, ఆదిరెడ్డి రచ్చరచ్చ చేశారు. ఇందులో విఫలమైన గీతూ తొలిసారి కంటనీరు పెట్టుకొని ఏడ్చేసింది. అంతటి బలమైన కంటెస్టెంట్ ను కూడా ఏడిపించిన ఘనత ఈ బిగ్ బాస్ చేపలకే దక్కిందంటే అతిశయోక్తి కాదు.
ఇక చివర్లో తోపుడు బండ్ల వ్యాపారం టాస్క్ పెట్టిన బిగ్ బాస్ ప్రేక్షకులకు మజాను పంచాడు. రేవంత్-బాలాదిత్య జోడిని ఈ టగ్ ఆఫ్ వార్ లో రాజ్-శ్రీహాన్ జోడి ఓడించింది. ఈ టాస్క్ సమయంలో అరుపులు, గోలలు బలప్రయోగాలు అబ్బో కావాల్సినంత మసాలా ఈ మంగళవారం ప్రేక్షకులు దక్కిందనే చెప్పాలి. మొత్తంగా మంగళవారం టాస్కుల్లో ప్రాణాలు పెట్టి మరీ పోరాడిన ఇంటిసభ్యులకు ఈరోజు 100కు 200 మార్కులు వేసిన తక్కువే అనడంలో అతిశయోక్తి కాదు.