CM KCR: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన ప్లీనరీలో వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని ప్రకటించారు. హ్యాట్రిక్ ఖాయమని స్పష్టం చేశారు. ‘తెలంగాణలో జరిగిన తొలి అసెబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు, రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 100కు పైగా గెలుస్తుంది’ అని అన్నారు.
అధికారం పెద్ద పని కాదు..
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద పని కాదన్నారు కేసీఆర్. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే ఈసారి ముఖ్యమని ప్రకటించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పల్లె నిద్ర (గ్రామాల్లో నైట్ హాల్ట్) వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ శాసనసభ్యులు అందుబాటులో లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జిల్లా ఇ¯Œ చార్జీలు ఆ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పద్దతి మార్చుకోవాలి..
ఇక కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను కేసీఆర్ సమావేశంలో మందలించారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై వచ్చిన ఫిర్యాదులు తన వద్ద ఉన్నాయిని తెలిపారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని సూచించారు. లేదంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. క్యాడర్‌లో అసంతృప్తి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించా. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, వారితో మమేకం కావాలని సూచించారు. టీవీ ప్రకటనలు, షార్ట్ ఫిలింలు నిర్మించడం ద్వారా పార్టీ ప్రజలకు చేరువవుతుందని బీఆర్‌ఎస్ చీఫ్ చెప్పారు. అవసరమైతే పార్టీ కోసం టీవీ చానెల్ కూడా పెడదామన్నారు.
ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వండి..
రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని, సర్వే నంబర్లతో ఆ భూముల వివరాలను తన కార్యాలయంలో అందజేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్న కేసీఆర్ తాజాగా ఖాళీ భూముల వివరాలు అడగడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుచరులు ప్రభుత్వ భూములను కాబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వివరాలు ఇస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ ధీమా ఏంటి?
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలస్తామని కేసీఆర్ ప్లీనరీలో ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌కు ఆ ధీమా ఎక్కడిది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై ఒకవైపు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేసినా బోటాబోటీ మెజారిటీతో బీఆర్‌ఎస్ గెలిచింది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ అంద గట్టిగా వంద సీట్లు గెలుస్తామని చెప్పడం వ్యూహాత్మకమే అంటున్నారు విశ్లేషకులు. విపక్షాలను డిఫెన్స్‌లో పడేయాలనే కేసీఆర్ ఈ ప్రకటన చేసి ఉంటారని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఉన్న సగం మంది ఎమ్మెల్యేలకే తాము గెలుస్తామన్న ధీమా లేదు. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారిలో 40 మంది ఎమ్మెల్యేలు, పది మంది మంత్రులు ఉన్నారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియంది కాదు. గతంలో ప్రశాంత్ కిశోర్ కూడా 60 మంది ఎమ్మెల్యేలను మార్చాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వంద సీట్ల ధీమా మేకపోతు గాంభీర్యమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇలాంటి విశ్వాసం నిపండం అధినేతగా కేసీఆర్ బాధ్యత అని పేర్కొన్నారు.
బలపడిన విపక్షాలు..
ఇక 2018 ఎన్నికలతో పోలీస్తే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో బలపడ్డాయి. అధికాపార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీలు సన్నద్ధం కాకముందే కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ ఎంత గట్టిగా ప్రయత్నించినా 40 సీట్లుకు మించి రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ అంతర్గత సర్వేలో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను మారిస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే హ్యాట్రిక్‌పై కేసీఆర్ ధీమాగా ఉన్నాడని తెలుస్తోంది. మరి చూడాలి రాబోయే ఆరు నెలల్లో ఏం జరుగబోతుందో..!