
BJP – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. బిజెపి అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రంలో బిజెపితో పొత్తులో ఉన్న పవన్ వచ్చే ఎన్నికలకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని బిజేపి అగ్ర నాయకత్వాన్ని గతంలో కోరారు. అయితే, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు బిజెపి అగ్ర నాయకులు ఏపీ ఎన్నికలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ కాకుండా కర్ణాటక కు సంబంధించిన ఎన్నికల రోడ్డు మ్యాప్ అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. ఇది ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల కిందట ఆకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో శరవేగంగా మార్పులు చేసుకుంటున్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఒకపక్క తెలుగుదేశం పొత్తుకు ఆసక్తి చూపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే అందరూ అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెనక ఏపీ రాజకీయాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ లేదని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బిజెపి అగ్ర నాయకులు పవన్ కళ్యాణ్ కు రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
వైసిపిని గద్దె దించాలి అని భావిస్తున్న పవన్ కళ్యాణ్..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పొత్తులుకు సిద్ధమవుతున్నారు. టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సిద్ధం కాగా.. తమతో పాటు కలిసి రావాలంటూ బిజెపిని కోరుతున్నారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి రోడ్డు మ్యాప్ ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందట బిజెపి అగ్ర నాయకులను పవన్ కళ్యాణ్ కోరారు. అయితే అందుకు అనుగుణంగా బిజెపి అగ్ర నాయకుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ తన దారిని ఎంచుకున్నారు. అందులో భాగంగానే టిడిపితో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
సడన్ గా ఢిల్లీ పర్యటనతో అనేక అనుమానాలు..
పవన్ కళ్యాణ్ సడన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా కీలక పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయని అంతా భావించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత టిడిపి వ్యవహార శైలిలో మార్పు రావడం, జనసేన పార్టీని ఆ నాయకులు పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ అసంతృప్తికి గురయ్యారని, అందులో భాగంగానే బిజెపికి దగ్గర అయ్యేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని అంతా భావించారు. ఒకానొక దశలో టిడిపిని వదిలి బిజెపి – జనసేన కలిపి ఎన్నికలకు వెళ్తాయని మీడియా ఛానల్స్ లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికీ విరుద్ధంగా ఢిల్లీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికలకు ప్రచారం చేయాలని..
మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న తరుణంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తన సత్తా చాటాలని భావిస్తున్న బిజెపి ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత మధ్యప్రదేశ్, చతీష్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల ఫలితం ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలపై ప్రభావం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తుంది. అందుకు కలిసి వచ్చే అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది బిజెపి అగ్ర నాయకత్వం. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బిజెపి అగ్ర నాయకత్వం తెలుగు ప్రజల అధికంగా ఉండే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. ఏపలో ఇప్పటికే అధికారికంగా ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించడం ద్వారా తెలుగు ప్రజల అధికంగా ఉండే బళ్లారి, బెంగళూరు సిటీ, రూరల్ వంటి నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చును భావిస్తోంది.
ముందు కర్ణాటక రోడ్డు మ్యాప్.. ఆ తర్వాత ఏపీ..
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెనుక అనేక చర్చలు నడిచాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ అగ్ర నాయకులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారంటూ పలువురు ప్రచారం చేయగా, ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే పవన్ కళ్యాణ్ వెళ్లారంటూ జనసేన చెబుతు వచ్చింది. ఎవరు పిలిస్తే ఎవరు వెళ్లారు అన్నదానికంటే ఎందుకు వెళ్లారు అన్నదాని పైన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చి నడిచింది. అయితే బిజెపి ముఖ్య నాయకులతో సమావేశమైన తర్వాత ఒక స్పష్టత దీనిపై వచ్చినట్లు అయింది. బిజెపి అగ్రనాయకత్వం కీలకంగా భావిస్తున్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ పవన్ కళ్యాణ్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి తరఫున ఇక్కడ పవన్ ప్రచారం చేయాలని బిజెపి అగ్ర నాయకుల కోరినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి కర్ణాటక రోడ్డు మ్యాప్ పూర్తిచేయాలని.. ఆ తర్వాత ఏపీకి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి ఇక్కడ గెలవడం కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ వినియోగించుకోవాలని బిజెపి భావించి హుటాహుటిన ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలతో పవన్ కళ్యాణ్ కు ఎటువంటి స్నేహమూ లేకపోవడం వలన.. ఏపీలో ఇప్పటికీ అధికారికంగా బిజెపితో మైత్రిని జనసేన కొనసాగిస్తుండడంతో ఈ మేరకు పిలిపించినట్లు చెబుతున్నారు.