Sai Ganesh Issue: అధికారం ఏమైనా చేయవచ్చు. కొండ మీది కోతిని కూడా ఆడించవచ్చు.అయితే అంతే స్థాయిలో ప్రతిపక్షం ఉంటే చాలా కష్టం. ఏపీలో వైసీపీకి టీడీపీలా.. ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ ధీటుగా నిలబడుతుంది. అస్సలు ఉనికి లేని జిల్లాల్లో సైతం యువకులతో కాక రేపుతోంది. గులాబీ పార్టీని బీజేపీ యువదళం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో చాలా మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బీజేపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపిన చరిత్ర బీజేపీది. అలాంటి జిల్లాలో ఆ పార్టీ నేతలను వదులుతుందా? వదలదు కదా? ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ తనను ఎదురించిన బీజేపీ కార్యకర్తపై గులాబీ శ్రేణులు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు అతడు ఆత్మహత్య చేసుకొని తన చావుకు ఓ మంత్రి కారణమని ఆరోపించారు. అదే ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యుడైన మంత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుల రాజకీయాలకు తెరతీశారని జోరుగా ప్రచారం సాగుతోంది.. పదవికి ముప్పు వస్తుందేమో అన్న అనుమానంతో మంత్రి స్థానంలో ఉండి మన కులమంతా ఒక్కటిగా ఉండాలి. మన కులంపై కుట్ర జరుగుతోంది’ అంటూ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయంగా, ఇటు జిల్లా ప్రజల నుంచే కాకుండా ఆయన వల్లించిన కులంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. కులం హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని మంత్రి కులం నేతలే ప్రకటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Jeevitha Rajasekhar: మోసం చేసి.. బుకాయిస్తే ఎలా జీవిత గారు ?
-కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు..
కమ్మ కులస్తులు రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. . ఒక చిన్న ఇన్సిడెంట్ విషయంలో కుట్రలు చేస్తూ.. కుతంత్రాలు పన్నుతూ ఏకమౌతున్నారని ఆరోపించారు. కొంతమంది సూడో చౌదరీలు చేతులు కలుపుతున్నారని.. దీనిని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు చేసుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఏపీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి కొడాలి నానిని తొలగించారని, ఇప్పుడు తనను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని పువ్వాడ ఆరోపించడం సంచలనంగా మారింది.
–అది చిన్న ఘటనా?
ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువ కార్యకర్త ఆత్మహత్యను మంత్రి అజయ్ కుమార్ చిన్న సంఘటనగా వ్యాఖ్యానించడం ద్వారా ఆయన తప్పుడు కేసులు పెట్టించింది వాస్తవమే అనే భావన జనంలో వ్యక్తమవుతోంది. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి ఏడాదిలో 16 కేసులు పెట్టించారనే ఆరోపణను స్వయంగా బాధితుడు చేశారు.. ఇప్పుడు మంత్రి ప్రకటనతో పరోక్షంగా యువకుడి ఆత్మహత్యకు పరోక్షంగా బాధ్యుడయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు చనిపోయిన తర్వాత కుడా మరో కేసు పెట్టించి తన అధికార బలాన్ని చాటుకున్నాడనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆత్మహత్యకు బాధ్యుడైన మంత్రిపై అటు విపక్షాలు, ఇటు ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. మరోవైపు హైకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో ఇంతకాలం మౌనం వహిస్తూ వచ్చిన మంత్రి అజయ్ ఎట్టకేలకు నోరు విప్పారు. తమ కుల సంఘ కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన అక్కడికి వచ్చిన కులమంతా తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించిన తీరు.. యువకుడి ఆత్మహత్యపై కనీసం పశ్చాతాపం లేకుండా చిన్న విషయం అంటూ మాట్లాడిన తీరును ఆయన కులం వారే వ్యతిరేకించడం గమనార్హం. అధికారం ఇచ్చేది ప్రజలకు అండగా నిలవాలని, సేవ చేయాలని కానీ, దానిని అడ్డం పెట్టకుని ప్రత్యర్థులను అణిచివేయాలని, చంపేయాలని కాదని కమ్మ నాయకులే అంటుండడం గమనార్హం. తాను చేసిన తప్పుకు కులం పేరు చెప్పుకుని సెంటిమెంటు రగిలిస్తే కమ్మలు నమ్మరని ఆ వర్గం వారు అంటున్నారు.

–మంత్రి బర్తరఫ్‌కే విపక్షాల డిమాండ్
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు సాయి గణే‹శ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దని బీజేపీ డిసైడ్ అయ్యింది.
-వివరణ అడుగుతారనే..
అయితే ఖమ్మం ఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గానీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గానీ నోరు విప్పకపోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ ఆరోపణ వచ్చినా విరుచుకుపడే గులాబీ నేతలు సొంతపార్టీ నేత, మంత్రి దౌర్జన్యంపై స్పందించకపోవడంతో విపక్షాలు మరింత దూకుడు పెంచాయి. ఈ క్రమంలో ఈనెల 27న జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఈ ఘటనపై పువ్వాడకు క్లాస్ తీసుకునే అవకాశం ఉందని పార్టీ నుంచి సమాచారం అందడంతోనే పువ్వాడ తాజాగా కులం కార్డు తెరపైకి తెచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
Also Read:KTR: జగన్ తో పంచాయతీ ఆంధ్రాలో చూసుకోవాలి.. షర్మిలపై కేటీఆర్ సెటైర్లు