Graphics of movies : మొన్నామధ్య ఓమ్ రౌత్ ప్రభాస్ ను హీరోగా పెట్టి తీస్తున్న ఆది పురుష్ టీజర్ వదిలాడు కదా! ప్రేక్షకులు “ఏందిరా మాకు ఈ దరిద్రం” అంటూ శాపనార్ధాలు పెట్టారు. కానీ ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్ ఆది పురుష్ కంటే రెట్లు బాగుంది. ఈ మాట అంటున్నది ఎవరో కాదు సాక్షాత్తు ప్రభాస్ అభిమానులు. 600 కోట్లు పెట్టి తీస్తున్న ఆది పురుష్ ఏదో కార్టూన్ షో మాదిరి కనిపించగా.. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ టీజర్ ఫర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్ లో సాగుతోంది.. ఇక రాజమౌళి తీసిన ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ బడ్జెట్లు కూడా అంతే. అంచనాలు దాటిపోయాయి.. దెబ్బకు నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచాల్సి వచ్చింది.. బాలీవుడ్ బ్రహ్మాస్త్ర, కోలీవుడ్ పొన్నియన్ సెల్వన్ కూడా వందల కోట్ల బడ్జెట్ సినిమాలే. వీటికి కూడా గ్రాఫిక్స్ పరంగా భారీగానే ఖర్చు పెట్టారు. కానీ ఇదే సమయంలో శాండల్ వుడ్ కాంతారా, టాలీవుడ్ హనుమాన్ సినిమాలు తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన గ్రాఫిక్స్ ను ఎలా చేసుకోవచ్చో నిరూపించాయి. అయితే దీనిపై చాలా మందికి కోపం రావచ్చు గాని.. ఈ గ్రాఫిక్స్ అంటేనే వందల కోట్ల దందా అయిపోయింది. వర్ధమాన దర్శకులు అతి తక్కువ ఖర్చుతో గ్రాఫిక్స్ ను వాడుతున్నప్పుడు.. పెద్దపెద్ద దర్శకులు వందల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు అనేది ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల మెదళ్ళలో నానుతోంది. ఇక మరికొద్ది రోజుల్లో అవతార్ 2 సినిమా విడుదల కాబోతోంది. దీనికోసం యావత్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమాకు సంబంధించి మూడు, నాలుగు భాగాలు ఉంటాయని ఈ చిత్ర దర్శకుడు కామెరూన్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ మాట అనడం లేదు..మొత్తానికి ఇదంతా తరచి చూస్తే.. ప్రేక్షకుల జేబులు కత్తిరించేందుకే ఈ గ్రాఫిక్స్ అనే మాయాజాలాన్ని వాడుతున్నట్టు తెలుస్తోంది.

సొమ్ము చేసుకుంటున్నారు
అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.. ఫిలిం సర్కిల్లో జేమ్స్ కామెరున్ అనే దర్శకుడి పేరు మార్మోగిపోతున్నది. అనేక భాషల్లో ఒకేసారి, పలు హైలి అడ్వాన్స్ టెక్నికల్ పద్ధతుల్లో రిలీజ్ కాబోతోంది.. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో 101.6 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తు తో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు.. కెనడా నుంచి తెప్పించిన వరల్డ్ క్లాస్ త్రీడి ప్రొజెక్టర్, ప్రపంచంలోనే పొడవైన తెర, దేశంలోనే భారీ తెర కాబోతోంది.. దాంట్లో ఈ అవతార్ ప్రదర్శించనున్నారు. టికెట్ కనీసం వెయ్యి రూపాయల దాకా ఉండొచ్చని సమాచారం. దీనికి తగ్గట్టే సౌండ్ ఎఫెక్టులు, మిగతా హంగూ ఆర్భాటం ఉంటాయని తెలుస్తోంది. అవతార్ సినిమా కోసం జేమ్స్ కామెరున్ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యంత అడ్వాన్స్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన గ్రాఫిక్స్ టెక్నాలజీ వాడాడు.
ఎప్పుడో మొదలైంది
అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. 2017 లో అసలు షూటింగ్ మొదలైంది. బడ్జెట్ మొదట్లో 25 కోట్ల డాలర్లు అనుకున్నారు. ఇప్పుడు కనీసం రెండు బిలియన్ డాలర్లు వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ రాదు అని కామెరున్ అంటున్నాడు.. అంటే ఆ లెక్క ప్రకారం మన కరెన్సీలో 16, 355 కోట్లు.. 25 కోట్ల డాలర్లు ఎక్కడ, 200 కోట్ల డాలర్లు ఎక్కడ? అంటే ఇప్పటివరకు ప్రపంచప్తంగా ఆత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్_5 లో చేరితే తప్ప ఈ అవతార్ 2 బ్రేక్ ఈవెన్ సాధించదు. జేమ్స్ కామెరున్ తీసిన అవతార్ ఫస్ట్ పార్ట్ 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా అదే అగ్రస్థానం.. ఆ తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ 2. 8 బిలియన్లు, టైటానిక్ 2.2 బిలియన్లు, స్టార్ వార్స్_7 రెండు బిలియన్లు, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రెండు బిలియన్ డాలర్లు వసూలు చేశాయి..కామెరూన్ చెప్పే దానిని బట్టి ఆ టాప్ 5 లో అవతార్_2 చేరాలి. కానీ సాధ్యమేనా? మొదట్లో మూడు, నాలుగు, ఐదు పార్టులుగా ఈ సినిమా తీస్తామని కామెరున్ చెప్పాడు. కానీ ఇప్పుడు వాటిపై నోరు మెదపడం లేదు.
వరస్ట్ సినిమానా
అవతార్ పార్ట్ 2 కి సంబంధించి ఖర్చు చూసి నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.. అమెరికాలో బడా ప్రొడక్షన్ హౌస్ లైన డిస్నీ, 20 సెంచరీ వాళ్ళు నెత్తినోరూ మొత్తుకుంటున్నారు. ఇంత ఖర్చు పెడితే ఎలా రికవరీ చేయగలమని భయపడుతున్నారు.. మరి ఇంత ఖర్చు పెట్టిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఏం చేయగలుగుతారో వేచి చూడాలి. వసూళ్లలో టాప్ వన్ చేస్తారా? 23 వేల కోట్లను దాటిస్తారా? ఇప్పుడు ఈ సినిమా హైప్ అలాగే ఉంది. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం తాలూకు భయాలు కమ్ముకుంటున్న వేళ అంత రేటు పెట్టి సినిమా హాల్లోకి వస్తారా? ఏమో…ఇదంతా కామెరూన్ కే తెలియాలి.