AP Employees Strike: ఏపీ సీఎం జగన్ బతిమిలాడినా.. ఏపీ మంత్రుల కమిటీ చర్చలకు పిలిచినా సరే.. పీఆర్సీ సహా సమస్యల పరిష్కారంలో తగ్గేదేలే అన్నట్టుగా ఏపీ ఉద్యోగులు ‘సమ్మె’ ప్రకటించారు. ఏపీలో సమ్మె సైరన్ మోగించారు. ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించి షాక్ ఇచ్చారు. వచ్చేనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శికి సమ్మె నోటీసులు అందజేసి ఏపీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చారు.
ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలను జారీ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. నిరసన కార్యక్రమాలను దిగుతున్నట్టు ప్రకటించారు.
దీంతో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరిద్దామని చూసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రుల కమిటీ సంధి కుదుర్చలేకపోయింది. ఇక ఏపీ హైకోర్టు పిలిచి ఉద్యోగ సంఘాల నేతలకు నచ్చజెప్పినా కూడా ఫలితం శూన్యంగా మారింది. ఏపీలో సమ్మె సైరన్ మోగింది. మరి దీనివల్ల ముందుముందు ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు.