ABN RK Anil Ravipudi: ఎప్పుడూ సీరియస్ ప్రశ్నలు.. రాజకీయ నాయకులకు చమటలు పట్టించేలా క్వశ్చన్స్ అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేసే ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కాసేపు అవన్నీ పక్కనపెట్టి కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి మనసారా నవ్వుకున్నారు. ఏబీఎన్ ఆర్కేతో ఇంటర్వ్యూ అనగానే లూప్ హోల్స్ అన్నీ బయటకు లాగుతాడని అందరూ కంగారు పడుతారు. కానీ నవ్వించే ఈ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందు అవన్నీ ఉడకలేదు. ఏబీఎన్ ఆర్కే కూడా నవ్వేశాడు.

పటాస్ నుంచి మొదలై విజయాల పరంపర ఎఫ్3 వరకూ రావడంతో ఈ సక్సెస్ తో తనకు కిక్కు పెరిగే కన్నా భయం పెరిగిందని.. ఒక్క ఫ్లాప్ వస్తే తనను తొక్కేస్తారని.. మీద పడి ఇన్నాళ్లు పొగిడినవారే తిట్టేస్తారని ఆ భయం తనకు ఉందని అనిల్ రావిపూడి అన్నారు.
ఇక తాను సినిమాల్లోకి రావడానికి సినీ నేపథ్యం ఉందని.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాకు దర్శకత్వం వహించారని ఆయనను చూసే తాను దర్శకుడిగా మారాలన్న కసి పెరిగిందని అనిల్ రావిపూడి వ్యాఖ్యానించారు.
ఇక తాను ఇంజినీరింగ్ మూడేళ్లు ఫెయిల్ అయిపోయానని.. ఫైనల్ ఇయర్ వచ్చే వరకూ స్కిట్ లు బాగా చేస్తే ‘దర్శకుడు’ అన్న పేరు వచ్చిందని.. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశానని అనిల్ రావిపూడి తెలిపారు. సినిమాల కిక్కు అప్పుడే మొదలైందన్నారు.
తన సినిమాలన్నీ కమర్షియల్ గా తీశానని. కానీ అందులోని కామెడీకి జనాలు కనెక్ట్ కావడంతో ‘ఎఫ్2’ను పూర్తి కామెడీ సినిమా తీస్తే అది బంపర్ హిట్ అయ్యిందని అనిల్ రావిపూడి తెలిపారు. బాలకృష్ణతో తీయబోయే నెక్ట్స్ సినిమా ఫుల్లీ కమర్షియల్ మాస్ మసాలా సినిమా అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక ‘అంతేగా’ లాంటి ఫేమస్ డైలాగులను జన మాండలికంలోంచి తీసుకున్నవేనని.. అనిల్ రావిపూడి తెలిపారు.గుంటూరు, ప్రకాశం జిల్లాలోని తెలియని మొరటుతనాన్ని నా సినిమాల్లో చూపిస్తానని తెలిపారు.
తన దర్శకత్వ ప్రతిభ మసకబారితే నెక్ట్స్ నటుడిగా మారి సినిమాల్లో నటిస్తానని అనిల్ రావిపూడి తెలిపారు. నగ్మా అంటే తనకు బాగా ఇష్టమని.. బాగా అట్రాక్ట్ చేశానని తెలిపారు. ఇక తన ఇంట్లో తన భార్య మాటకు తలూపుతానని అనిల్ వివరించారు.