Heat Wave 2023: భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలో 46.4° ఉష్ణోగ్రత బుధవారం నమోదయింది. వాస్తవానికి ఈ ప్రాంతం అవనికి పచ్చ కోక కట్టినట్టు ఉంటుంది.. ఇలాంటి ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత రికార్డు కావడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాదు అడవులకు పుట్టినిల్లు అయిన ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిన్న మొన్నటి వరకు మనం చదివాం. కానీ ఇప్పుడు సూర్యుడితాపానికి ఏ ప్రాంతం కూడా అతీతం కాదని తేలిపోయింది. అంతేకాదు మరో ఐదు సంవత్సరాల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో భయం కూడా కలుగుతున్నది. వారం పది రోజులు ఈ స్థాయిలో ఎండలు ముదిరితేనే జనం కకావికలం అవుతున్నారు. ఇదే సమయంలో ఐదేళ్లపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు అయితే మాత్రం అధికంగా ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంది.
ఎండలు సెగలు పుట్టిస్తాయి
అయితే ఇప్పటిదాకా చరిత్రలో నమోదైన సంవత్సరాల సగటు కంటే ఎక్కువగా ఎండలు సెగలు పుట్టిస్తాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ప్రపంచ దేశాలు విడుదల చేస్తున్న కార్బన ఉద్గారాల దెబ్బకు భూతాపం పెరగడంతో పాటు, ఎల్ నీనో( మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం, ఈ పరిస్థితి సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది) ప్రభావం కూడా దీనికి తోడు కావడం కూడా ఒక కారణమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2015లో పారిస్ లో జరిగిన పర్యావరణ సదస్సులో పెట్టుకున్న లక్ష్యాలను మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హెచ్చరించింది. వచ్చే ఐదు సంవత్సరాలలో కనీసం ఒక సంవత్సరం లేదా మొత్తం ఐదేళ్ళూ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 98 శాతం వరకు ఉందని డబ్ల్యూ ఎం వో వివరించింది. అలాగే ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఒక ఏడాదిలో అంతర్జాతీయంగా ఉపరితల ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ యుగం నాటిక పోలిస్తే 1.5 డిగ్రీలకు పైగా నమొదయ్యే ప్రమాదం 66% ఉందని హెచ్చరించింది..
1850_1900 తో పోలిస్తే..
వన్ పాయింట్ వన్ డిగ్రీల సెల్సియస్ నుంచి 1.8 డిగ్రీల దాకా నమోదు అవుతాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం అంచనా వేసింది. గణాంకాల ప్రకారం 2015 నుంచి 2022 మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2023-27 కాలంలో ఎండ వేడిమి అంతకుమించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. భూతాపం ఇలా పెరుగుతూ పోతే మానవాళి మనుగడకే ప్రమాదం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో 2015 డిసెంబర్ లో పారిస్ లో జరిగిన కాప్ 21 సదస్సులో భూతాప పరిమితి పై ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. 1850-1900 సమయంతో పోలిస్తే భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల లోపు ఉంచడం, 1.5 సెంటిగ్రేడ్ కు పరిమితం చేయడం, 2050_2100 మధ్య ఉద్గారాల విడుదలను సున్నా స్థాయికి తీసుకురావడం ఆ ఒప్పందంలో అంశాలు. కానీ వాస్తవ పరిస్థితుల్లో భూతాపం పెరుగుతూనే ఉంది. 1850-1900 నాటి సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2022 నాటికి అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు 1.15 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే పెరిగాయి.
ఏసీలతో భూగోళం నిప్పుల కొలిమి
ఏసీల వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది కానీ.. కర్బన ఉద్గారాలతో అసలే నానాటికి వేడెక్కుతున్న భూగోళం మరింత మండే నిప్పుల కొలిమిలా మారిపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ఈ దశాబ్దం చివరికల్లా ప్రస్తుతం ఉన్న ఏసీలకు మరో 100 కోట్ల ఎయిర్ కండిషనర్లు తోడవుతాయని ఒక అంచనా. 2040 నాటికి ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. జనాభాతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే భారత్, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో ఎయిర్ కండిషనర్ల వినియోగం నానాటికి పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఏ దేశంలో అయినా పౌరుల సగటు వార్షిక ఆదాయం 8.24 లక్షలకు చేరితే ఆ దేశంలో ఏసీల వినియోగం భారీగా పెరుగుతుందని ఒక అంచనా. మనదేశంలో తొలిసారి ప్రజల సగటు వార్షికోత్సవం 9వేల డాలర్లకు ఈ ఏడాది చేరుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే గడిచిన కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో ఏసీల అమ్మకాలు 15 రెట్లు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీల తయారీ సంస్థ డైకిన్ తెలిపింది.