Chandrababu Naidu: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తప్పదా? పదేపదే వైసీపీ మంత్రులు, నేతలు ఇదే విషయాన్ని ఎందుకు ప్రస్తవిస్తున్నట్టు? అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబు పాత్ర ఉందని ఆధారాలు సేకరించారా? సుప్రీం కోర్టు తాజా తీర్పుతో వైసీపీ సర్కారు స్పీడు పెంచనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు నుంచి మంత్రుల వరకూ ఇప్పుడు చంద్రబాబు అవినీతి గురించి ప్రస్తావిస్తుండడం విశేషం. అదే పనిగా మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసరుతుండడం చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టులో స్టే…
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతితో సహా భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని అప్పటి విపక్షంగా ఉన్న వైసీపీ గట్టిగా ప్రశ్నించింది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రంధ్రాన్వేషణ చేసింది. విచారణకు ప్రత్యేక సిట్ ను ఏర్పాటుచేసింది. దానిపై విచారణ జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, అలపాటి రాజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో సిట్ విచారణ వద్దంటూ హైకోర్టు స్టే విధించింది. దీంతో విచారణ నిలిచిపోయింది.
సుప్రీంలో కొట్టివేత..
అయితే హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ జగన్ సర్కారు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి, ఇతరత్రా అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటని =ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని ధర్మాసనం నిలదీసింది. దీంతో హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సిట్ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది. దీంతో చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల్లో అవినీతిని బయటకు తెచ్చేందుకు ఉన్న మార్గాలను వెతికితీసే పనిలో ఏపీ సర్కారు ఉంది.
వైసీపీ నేతల వ్యాఖ్యలు..
ఈ విషయంపై వైసీపీ నేతలు వరుసపట్టుకొని మరీ మాట్లాడుతున్నారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఆయన హయాంలో అవినీతి జరిగిందని నిరూపించే పనిలో పడింది. పట్టుబిగించాలని చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. అమరావతి ఏ అంశాన్ని ముట్టుకున్నా అవినీతే కనిపిస్తోందన్నారు.మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందని అన్నారు. అమరావతి భూముల స్కాం దేశంలోనే పెద్దదని అన్నారు. దీని మీద సిట్ విచారణ చేస్తే దోషులు ఎవరో బయటకు వస్తారని అన్నారు. సీనియర్ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయి అన్నది నిజం అన్నారు. దాని మీద తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు అమరావతి రాజధాని పేరు చెప్పి ఎన్నో దుర్మార్గాలు చేశారని అవన్నీ సిట్ విచారణ జరిగితే బయటకు వస్తాయని అంటున్నారు.
అంత సీన్ లేదంటున్న టీడీపీ..
అయితే టీడీపీ నేతలు మాత్రం అంత సీన్ లేదంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అయితే గట్టి సవాల్ విసిరారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం మీ తరం కాదన్నారు. మరో సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నాలుగేళ్లలో ఒక్క చార్జిషీట్ కూడా ఎందుకు వేయలేకపోయారని ప్రశ్నించారు. అమరావతిలో ఏమీ లేదు కాబట్టే వైసీపీ ఏమి చేయలేకపోతోంది అని గుర్తు చేశారు. రాజకీయంగా ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. వైసీపీ మాత్రం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది.. చంద్రబాబును అరెస్ట్ చేసి తీరుతామంటున్నారు మంత్రులు.
సరికొత్త విశ్లేషణలు
అయితే దీనిపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు కేవలం హైకోర్టు తీర్పు పై స్టే మాత్రమే ఎత్తేసిందని.. స్కాం గురించి ఏమీ కామెంట్లు చేయలేదన్నారు. ఒక వేళ రాజకీయ దురద్దేశాలతో విచారణ జరుగుతోందని అనుమానం వస్తే.. మళ్లీ కోర్టును ఆశ్రయించ వచ్చని పేర్కొంది. అయితే తుది నిర్ణయం హైకోర్టు మాత్రమే తీసుకుంటందని చెప్పింది. ఈ లెక్కన చూసుకున్నా.. మళ్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది చూడాలి.అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కనుక సుప్రీంకోర్టు విచారణ జరపమని ఆదేశిస్తే ఇప్పటికే ఇక్కడ జరిగిందని తేల్చిన జగన్ సర్కార్ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. లీక్ కు కుంభకోణానికి సూత్రధారి అయిన చంద్రబాబును ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేసి జైలుకు పంపే ప్రమాదం ఉంది. సో రాబోయే రోజుల్లో చంద్రబాబు అరెస్ట్ తప్పదన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.