Homeఆంధ్రప్రదేశ్‌Alluri Sitarama Raju: అల్లూరి జయంతి స్పెషల్: పరాక్రమ పోరాటంలో ఎవరికీ తెలియని నిజాలు

Alluri Sitarama Raju: అల్లూరి జయంతి స్పెషల్: పరాక్రమ పోరాటంలో ఎవరికీ తెలియని నిజాలు

Alluri Sitarama Raju: అల్లూరి.. ఈ మాటలోనే ఓ వైబ్రేషన్ ఉంది. దేశ స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజుది ప్రత్యేక స్థానం. బ్రిటీష్ సామ్రాజ్యవాదులను నిద్ర పట్టనివ్వని గెరిల్లా పోరాటం ఆయన సొంతం. ఎన్నో సంచలనాల ఘట్టం. దేశం కోసం అమరుడై వందేళ్లు కావస్తున్నా అల్లూరి రగలించిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉందంటే ఆయన చరిత్ర ఎంత ఘనమైనదో అర్థం చేసుకోవచ్చు. బాల్యం నుంచి ఎన్నో ముళ్ల కిరిటాలను దాటుకుంటూ బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు గెరిల్లా పోరాటమే శరణ్యమని నమ్మిన గొప్ప దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు. పుట్టింది క్షత్రియ కుటుంబంలోనైనా మన్యంలో గిరిజనుల పక్షాన పోరాడిన ఒక మహోన్నత యోధుడు.

Alluri Sitarama Raju
Alluri Sitarama Raju

1897 జూలై 4న విశాఖ జిల్లా పాడ్రంగిలో అల్లూరి జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులు, చిన్నానటి నుంచే అల్లూరికి దైవభక్తి ఎక్కువ. చదువులో కూడా రాణించారు.సాకల విద్యపారంగతుడు. విద్యార్థి దశలోనే ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తపస్సు చేశారు. చదరంగం, గుర్రపు స్వారీ, జ్యోతిష్యం వంటి వాటిలో విశేష ప్రావీణ్యం సంపాదించుకున్నారు. మల్లయుద్ధం, కర్ర, కత్తి సాము, తుపాకీ కాల్చడం వంటి యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. స్వగ్రామం విశాఖ జిల్లాలోని పాడ్రంగి అయినా.. కాలక్రమేణా అల్లూరి కుటుంబం భీమవరం సమీపంలోని మోగల్లులో స్థిరపడింది. సీతారామరాజు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి వెంకటరామరాజు కలరాతో మరణించారు.

Also Read: Double engine: రాబోయేది ‘డబుల్ ఇంజిన్’ సర్కారే: మోదీ

కానీ నాడు తండ్రి రగిలించిన స్ఫూర్తితోనే సీతారామరాజులో స్వాతంత్రోద్యమ జ్వలాలు గూడు కట్టుకున్నాయి. తండ్రి ఫొటో స్టూడియో నడిపేవారు. రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒక సారి గోదావరి తీరంలో తండ్రితో కలిసి సీతారామరాజు మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఆ సమయంలో బ్రిటీష్ అధికారి ఒకరు గుర్రంపైరాగా.. అందరూ నమస్కరించారు. వారితో పాటు సీతారామరాజు కూడా అధికారికి నమస్కారం చేశారు. చూసిన తండ్రి సీతారామరాజుపై చేయి చేసుకున్నారు. బ్రిటీష్ వారి దురాగతాలను కుమారుడికి వివరించారు. దీంతో అప్పటి నుంచే బ్రిటీష్ పాలకులపై కోపం పెంచుకున్నారు. వారిపై ఒక వ్యతిరేక భావన గూడు గట్టకున్నది అప్పటి నుంచే. అక్కడకు ఒక ఏడాది తరువాత అల్లూరి తండ్రి మరణించారు.

Alluri Sitarama Raju
Alluri Sitarama Raju

దేశవ్యాప్త సందర్శనలతో..
గోదావరి జిల్లాలతో పాటు విశాఖతో అల్లూరికి ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యాభ్యాసం కూడా ఒక చోట సాగలేదు. 5వ ఫారం వరకూ అల్లూరి చదువుకున్నారు. 18వ ఏటా దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. రుషీకేష్, ప్రయాగ, గంగోత్రి, బద్రినాథ్,కాశీ వంటి ప్రాంతాలను చూశారు. అక్కడి విదేశీ పాలకుల దురాగతాలు కలిచివేశాయి. అటు తరువాత ఆ కుటుంబం విశాఖ, తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడింది. బ్రిటీష్ పాలకులపై విపరీతమైన ఏహ్య భావాన్ని అకలింపు చేసుకున్న అల్లూరి తన ప్రాంతంలో పీడిత వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడం ప్రారంభించారు. తూర్పు కనుమల్లో గిరిజనులు దగాకు గురి అవుతుండాన్ని సహించలేకపోయారు. బ్రిటీష్ అధికారుల దమననీతిని, శ్రమదోపిడీపై గట్టి పోరాటమే చేశారు. అక్కడ నుంచి అల్లూరిపై కేసులు నమోదుచేయడం, ఇంటిలో నిర్బంధించడం పరిపాటిగా మారింది. బ్రిటీష్ పాలకుల చర్యతో విసిగి వేశారిన అల్లూరి సాయుధ పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారు. 1922 ఆగస్టులో గెరిల్లా పోరాటానికి దిగారు. విశాఖ జిల్లా క్రిష్ణదేవిపేటను వేదికగా చేసుకున్నారు. గిరిజన పెద్దలు గంటందొర, మల్లుదొరలను కలుసుకున్నారు. స్వాతంత్రోద్యమంపై ఆకర్షితులైన వారితో పెద్ద సైన్యాన్ని రూపొందించుకున్నారు. అల్లూరి పిలుపునకు 1,800 మంది వీరులు ముందుకొచ్చారు. గెరిల్లా సైన్యంగా ఏర్పడ్డారు.

పోలీస్ స్టేషన్లపై దాడుల పరంపర..
తొలిసారిగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. పోలీసులను తాళ్లతో బంధించి తుపాకులు, ఇతర సామగ్రిని పట్టుకుపోయి బ్రిటీష్ పాలకులు సవాల్ విసిరారు. వాటి వివరాలను స్టేషన్ డైరీలోనే ఇంగ్లీష్ లో రాసి తనలోనున్న తెగువను చూపారు అల్లూరి. ఆ మరుసటి రోజు కేడీపేట పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. విలువైన ఆయుధాలను అపహరించారు. ఈ రెండు ఘటనలు విజయవంతం కావడంతో అల్లూరి సేన ఇక వెనుదిరిగి చూడలేదు. స్టేషన్ లపై దాడుల పరంపరను కొనసాగించారు. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడిచేసి ఉద్యమకారుడు వీరయ్యదొరను విడిపించుకున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే మూడు పోలీస్ స్టేషన్లపై దాడిచేసిన అల్లూరి సేన బ్రిటీష్ పాలకుల్లో వణుకు పుట్టించింది. ఈ పరిణామ క్రమంలో ఆయుధ సంపత్తిని కొంతవరకూ సమకూర్చుకున్న అల్లూరి విప్లవసేన విదేశీ పాలకుపై సమరశంఖం పూరించింది. అదే స్థాయిలో బ్రిటీష్ పాలకులు కూడా ప్రపంచ యుద్ధ వీరులైన బ్రిటీష్ సైనిక అధికారులను రంగంలోకి దింపింది. బలగాను ఏజెన్సీలో మోహరించింది.కానీ వారి ఎత్తులను చిత్తు చేసింది అల్లూరి విప్లవ సేన.ప్రపంచ యుద్ధాల్లో ఆరితేరిన స్కాట్ కవర్ట్, హైటర్ అనే ఇద్దరు బ్రిటీష్ అధికారులను సైతం మట్టుబెట్టింది. అంతటితో ఆగకుండా ముందస్తు సమాచారమిచ్చి..అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడులు చేసింది. కానీ బ్రిటీష్ పాలకులు ముందుగా జాగ్రత్తపడడంతో ఆయుధాలేవీ దొరకలేదు. 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన అల్లూరి సైన్యం ఏకంగా సత్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారంటే వారిలోనున్న తెగువ, ధైర్యం అర్థం చేసుకోవచ్చు.

Alluri Sitarama Raju
Alluri Sitarama Raju

వేలాది సైన్యంగా వచ్చి..
బ్రిటీష్ పాలకులకు కొరకరాని కొయ్యగా మారిన అల్లూరిని పట్టకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం కలెక్టర్ లూథర్ ఫర్డ్ సేనను రంగంలోకి దింపిది. దీంతో అల్లూరి సేన కోసం మన్యంను బ్రిటీష్ సైనికులు జల్లెడ పట్టారు. అల్లూరిని బంధించి ఇచ్చిన వారికి రూ.10 వేలు నజరానా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1924 మే 1నుంచి 6వ తేదీ వరకూ అల్లూరి సేనకు, బ్రిటీష్ సైన్యానికి మధ్య రాజవొమ్మంగి మండలం కొండపల్లి వద్ద భీకర పోరు నడిచింది. అల్లూరి వైపు వందలాది మంది సేన ఉంటే.. అటు బ్రిటీష్ వారి వైపు వేలాది మంది సైన్యం ఉన్నారు. ఆయుధ సంపత్తి సైతం ఉంది. మే 7న అల్లూరిని బ్రిటీష్ సైన్యం చుట్టుముట్టి నిర్బంధించింది. చెట్టుకు కట్టి కాల్చి చంపారు. అనంతరం అల్లూరి భౌతికకాయాన్ని కేడీపేట తీసుకొచ్చారు. అక్కడకు ఐదు రోజుల తరువాత అల్లూరి మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. చనిపోయే నాటికి అల్లూరి వయసు 27 సంవత్సరాలు. అత్యంత చిరుప్రాయంలోనే అల్లూరి దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టారు. చేసింది స్వల్పకాల పోరాటమే అయినా దేశ స్వాతంత్రోద్యమంలో అల్లూరి కలికితురాయిగా ఉండిపోయారు. ఆచంద్రార్కం నిలిచిపోయారు.

Also Read:Jagan Contest: వైసీపీ రాజకీయం.. జగన్ ‘సీటు’కే ఎసరు..!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular