Marwari wedding railway coach: ఒకప్పుడు పెళ్లి వేడుకలు సాధారణంగా జరిగేవి. శ్రీమంతులు మాత్రమే భారీగా ఖర్చు పెట్టుకునేవారు. పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డబ్బులు ఎవరూ లెక్కచేయడం లేదు. ఆడంబరానికి.. అట్టహాసానికి పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా ఆదాయ వర్గాలతో సంబంధం లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
పెళ్లి వేడుకలు నిర్వహించుకునే విధానంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తున్నారు. ఆగర్భ శ్రీమంతులు డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇతర దేశాలు.. ఇతర రాష్ట్రాలలో పెళ్లి వేడుకలను జరుపుకుంటూ సందడి చేస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం భయపడకుండా.. తమ స్థాయిని నిరూపించుకుంటున్నారు.. పెళ్లి వేడుకలను ఘనంగా జరపడానికి ఏకంగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఏర్పాటయ్యా అంటే.. ఆడంబరాలకు మన వాళ్ళు ఏ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పెళ్లి వేడుకలు జరుపుకునే విషయంలో ఒక మార్వాడి కుటుంబం ట్రెండ్ ను సృష్టించింది. పెళ్లి అనంతరం బరాత్ కోసం ఏకంగా రైలు కోచ్ బుక్ చేసుకుంది. దానిని కదిలే కళ్యాణమండపం లాగా మార్చేసింది. కోచ్ నెంబర్ ప్లేట్ కు పూల మాలలతో అలంకరించింది ఆ కుటుంబం. పెళ్లి వేడుకకు హాజరయ్యే వారికి ఆహ్వానం అంటూ బ్యానర్ కూడా ఏర్పాటుచేసింది. పెళ్లి వేడుకను మొత్తం అందులోనే జరిపింది. పెళ్లి ముగిసిన తర్వాత డీజే పాటలు పెట్టుకొని వధూవరులు.. బంధువులు డాన్సులు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు నెటిజన్ల ను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
” పెళ్లి వేడుక అనేది జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అది మధురమైన ఘట్టం లాగా నిలిచిపోవాలని అనుకున్నాం. అందువల్లే రైలు కోచ్ బుక్ చేసుకున్నాం. మా స్థాయిలో వేడుక జరుపుకున్నాం. డ్యాన్సుల నుంచి మొదలు పెడితే విందుల వరకు అన్నిట్లోనూ మా స్థాయి ప్రదర్శించేలా ఏర్పాటు చేసుకున్నాం. ఇండియన్ రైల్వే చరిత్రలో ఇలా రైలు కోచ్ లో ఎవరూ పెళ్లి చేసుకొని ఉండరని” ఆ మార్వాడి కుటుంబం చెబుతోంది.