TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కళలకు ప్రాధాన్యతనిస్తూ అమెరికాలోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తానా కళాశాల ప్రాక్టికల్స్ పరీక్షలు అట్లాంటాలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్.పి.ఎం.వి.వి) సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక గాత్రం, వీణ వంటి శాస్త్రీయ కళలలో వివిధ స్థాయిల కోర్సులకు పరీక్షలు జరుగుతాయి.
ఈసారి అట్లాంటాలో నిర్వహించిన ప్రాక్టికల్స్‌లో మొత్తం 24 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. హాల్ టికెట్ ప్రక్రియ, పరీక్షల నిర్వహణ పద్ధతి, పారదర్శకతపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన నిర్వహణ తానా కళాశాల ప్రామాణికతను ప్రతిబింబించిందని వారు పేర్కొన్నారు.

కర్ణాటక గాత్రంలో 40 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న శ్రీవల్లి శ్రీధర్ గారిని ఈ సందర్భంలో తానా అట్లాంటా బృందం ఘనంగా సన్మానించింది. యువతలో శాస్త్రీయ కళలను పెంపొందించడంలో ఆమె చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు.

నిర్వాహకులు మాట్లాడుతూ, రాబోయే సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచి, శాస్త్రీయ కళలను విస్తృతంగా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రంగా సదుపాయాలు కల్పించినందుకు మోహిని ముత్యాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనేక ఏళ్లుగా అట్లాంటాలో ఈ కేంద్రం తానా కళాశాల పరీక్షలకు వేదిక అవుతూ వస్తోందని గుర్తుచేశారు.

ఈ విజయవంతమైన కార్యక్రమంలో మాలతి నాగభైరవ (కళాశాల చైర్), శ్రీనివాస్ లావు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), అంజయ్య చౌదరి లావు (మాజీ అధ్యక్షుడు), మధుకర్ యార్లగడ్డ (ఫౌండేషన్ ట్రస్టీ), సోహిని అయినాల (మహిళా సేవల సమన్వయకర్త), సునీల్ దేవరపల్లి (సాంఘిక సంక్షేమ సమన్వయకర్త), శ్రీనివాస్ ఉప్పు, మురళి బొడ్డు తదితరులు కీలక పాత్ర పోషించారు.
అలాగే సౌత్ ఈస్ట్ తానా ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు, తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఈ ప్రాక్టికల్స్ విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ తానా సంస్థ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.