America: అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలో భారీతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులపై అనేక ఆంక్షలు పెట్టారు. హెచ్–1బీ వీసాలు తగ్గించారు. దీంతో అమెరికాకు వెళ్లడానికి ఇప్పుడు భారతీయ విద్యార్థులు పునరాలోచిస్తున్నారు. అయితే 2025 సంవత్సరంలో మాత్రం అమెరికాలో.. మన వాళ్లే అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయులు వరుసగా రెండోసారి మొదటి స్థానాన్ని సాధించారు. 2024–25 విద్యా సంవత్సరంలో 3.63 లక్షల మంది భారతీయులు చేరి, చైనాను వెనక్కి నెట్టారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ’ఓపెన్ డోర్స్’ నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది.
సంఖ్యలో పెరుగుదల..
గతేడాది 3.30 లక్షల నుంచి 10 శాతం పెరిగి 3.63 లక్షలకు చేరిన భారతీయులు అగ్రస్థానాన్ని ఇరుక్కున్నారు. చైనా విద్యార్థుల సంఖ్య 2.77 లక్షల నుంచి 4 శాతం తగ్గి 2.66 లక్షలకు చేరింది. మొత్తం విదేశీ విద్యార్థులు 11 లక్షలకు పైగా ఉండటంతో భారతీయులు ముఖ్య భాగస్వాములుగా నిలిచారు. విదేశీ విద్యార్థుల 57 శాతం మంది స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగాల్లో చేరారు. భారతీయుల్లో 43 శాతం కంప్యూటర్ సైన్స్, 23 శాతం ఇంజినీరింగ్, 11 శాతం బిజినెస్ కోర్సులు ఎంచుకున్నారు. అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలు 5 శాతం పెరిగినా మాస్టర్స్ 15 శాతం తగ్గాయి.
ఫాల్ సీజన్ ప్రవేశాల్లో క్షీణత
2024 ఫాల్ సీజన్‌లో కొత్త విదేశీ ప్రవేశాలు 2.77 లక్షలకు పరిమితమై, మునుపటి ఏడాది కంటే 7 శాతం తగ్గాయి. ట్రంప్ పాలసీల ప్రభావం 2025 ఫాల్‌లో 17 శాతం మొత్తం, భారతీయులు 40 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా. వచ్చే నివేదికలు దీనిని స్పష్టం చేస్తాయి. ఇక గత మూడేళ్లలో మన విద్యార్థులు మాత్రం గణనీయంగా పెరిగారు. 2022–23లో 2,68,923, 2023–24లో 3,31,603, 2024–25లో 3,63,091కి పెరిగారు. అంటే 2022–23లో 25.43 శాతం ఉన్న భారతీయ విద్యార్థులు 2024–25లో 30..80 శాతానికి పెరిగారు.