Canada: విదేశీ చదువుల కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చడంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
స్పందించిన విదేశాంగ శాఖ..
కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళనలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కెనడాకు చదువుకోవడానికి వెళ్లారన్నారు. విద్యార్థుల సంఖ్య అధికం కావడంతో వందలాది మంది దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భారతీయ విద్యార్థులకు సంబంధించి సమస్య ఎదుర్కొంటున్నట్లు కనిపించటం లేదని పేర్కొన్నారు.
హక్కుల కోసం పోరాటం..
ఇదిలా ఉండగా తమ హక్కుల కోసం రెండు వారాలుగా నిరసన తెలుపుతున్నామని భారతీయ విద్యార్థులు పేర్కొంటున్నారు. తమకు పారదర్శకత కావాలని కోరుతున్నారు. అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తామని ఓ విద్యార్థి ఎక్స్‌లో పేర్కొన్నాడు.
వలసదారుల తగ్గింపు చర్యలు..
కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావడంతో హెల్త్‌కేర్, నివాస సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చారు. దీంతో విద్యార్థులు బహిష్కరణ ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.