Canada: కెనడాలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తితో పొడిచి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగినట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి, కత్తితో పొడిచి దారుణంగా చంపినట్లు సమాచారం. ఈ హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కెనడా పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించగా, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హత్య జరిగిన విషయంపై స్పందిస్తూ, బాధితుడి కుటుంబానికి సాధ్యమైన సహాయం అందించేందుకు కెనడా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. విదేశాల్లో భారతీయుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో హైదరాబాద్ ఫాదర్ హత్య
ఇదే తరహాలో అమెరికాలోనూ మరో దారుణ హత్య జరిగింది. హైదరాబాద్కు చెందిన క్యాథలిక్ మతగురువు ఫాదర్ అరుల్ కరసాల (57) కాన్సాస్లోని సెనెకా ప్రాంతంలో గురువారం హత్యకు గురయ్యారు. చర్చి వెలుపల ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై సమీపం నుంచి మూడుసార్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫాదర్ కరసాలను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
సెనెకాలోని ఇమ్యులేట్ కాన్సెప్ట్ చర్చి ఈ దుర్ఘటనను ధ్రువీకరించింది. “ఫాదర్ కరసాల ఒక నాయకుడు, స్నేహితుడు. ఆయన మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది” అని కాన్సాస్ సిటీ ఆర్చ్ బిషప్ జోసెఫ్ ఫ్రెడ్ నౌమన్ విచారం వ్యక్తం చేశారు. ఈ కాల్పులకు దారితీసిన కారణాలపై అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఓక్లహామాకు చెందిన 66 ఏళ్ల గ్యారీ హెర్మెష్ అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫాదర్ కరసాల గురించి
ఫాదర్ అరుల్ కరసాల హైదరాబాద్ స్వస్థలంగా కలిగిన వ్యక్తి. 1994లో కడప డయాసిస్‌లో ఫాదర్‌గా సేవలు అందించారు. 2004లో ఆర్చ్ బిషప్ జేమ్స్ పి. కెలెహర్ ఆహ్వానంతో కాన్సాస్కు వెళ్లారు. 2011లో అమెరికా పౌరసత్వం పొందిన ఆయన, సెనెకాలోని సెయింట్స్ పీటర్, పాల్ కాథలిక్ చర్చిలలో పాస్టర్‌గా పనిచేశారు. ఆయన హత్య స్థానిక భారతీయ సమాజంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
విదేశాల్లో భారతీయుల భద్రతపై ప్రశ్నలు
కెనడా, అమెరికాలో జరిగిన ఈ రెండు హత్యలు విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై సీరియస్ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనలపై భారత ప్రభుత్వం, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.