America: అమెరికా అనుకుంటాం గాని.. అక్కడ చొరబాట్లేం తక్కువ కాదు..

సుప్రసిద్ధ డైలీ మెయిల్ పత్రిక కథనం ప్రకారం.. అమెరికాలో సుమారు ఐదు మిలియన్లు అంటే 50 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారట. వీరంతా కూడా సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారట.

Written By: Suresh, Updated On : March 7, 2024 11:03 am

America

Follow us on

America: పకడ్బందీ చట్టాలుంటాయి.. చేసిన పనికి తగ్గట్టుగా వేతనాలు ఉంటాయి. సుఖవంతమైన జీవితం ఉంటుంది. భద్రతాపరంగా బాగుంటుంది. సంపాదించుకోవాలి అనుకునే వాళ్లకు అద్భుతంగా ఉంటుంది. అమెరికా గురించి స్ఫురణకు వస్తే పై మాటలే చాలా మంది చెబుతుంటారు. మేడిపండు లాగా అమెరికాలో కూడా అక్రమాలకు తక్కువేం కాదా? మా దగ్గర పకడ్బందీ చట్టాలు ఉన్నాయని చెప్పే ఆ దేశంలో అక్రమ చొరబాటుదారులను ఆ ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయా? అంటే దీనికి అవుననే సమాధానాలు వస్తున్నాయి.

సుప్రసిద్ధ డైలీ మెయిల్ పత్రిక కథనం ప్రకారం.. అమెరికాలో సుమారు ఐదు మిలియన్లు అంటే 50 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారట. వీరంతా కూడా సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారట. అయితే వీరిపై గతంలో ఉన్న ప్రభుత్వాల నుంచి మొదలుపెడితే ప్రస్తుత బైడెన్ ఏలుబడి వరకు చర్యలు తీసుకోలేదట. కనీసం వారిని దేశం నుంచి బయటికి పంపించాలనే ఆలోచన కూడా వారికి లేదట. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం ఒక ఉద్యోగికి పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలంటే చాలా డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. అదే చట్ట పరిధిలో లేని వారికి నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా ఎక్కువ గంటలు పనిచేయించి తక్కువ వేతనం ఇవ్వచ్చు. అందువల్లే అమెరికాలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ చొరబాటుదారులు పెరుగుతున్నారని తెలుస్తోంది.

త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అక్రమ చొరబాటుదారుల విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికన్ చట్టాల ప్రకారం అక్రమ చొరబాటుదారులు అక్కడ ఉండకూడదు. కానీ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వారు అక్కడ ఉండగలుగుతున్నారు. వారికి తక్కువ వేతనం ఇచ్చి, ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు. అయితే ఇందులో భారతీయులు కూడా ఉన్నారట. అయినప్పటికీ అక్రమ చొరబాటుదారులను బయటికి పంపించే ఉద్దేశం అటు రిపబ్లికన్ పార్టీ, ఇటు డెమొక్రటిక్ పార్టీకి లేదని డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది. అట్ట దీనిబట్టి చూస్తే తన అవసరాలకు అనుగుణంగా అమెరికా ఎలాంటి అడుగు అయినా వేస్తుంది. తన నిబంధనలకు తానే తూట్లు పొడుస్తుంది.