Anil Boinapally : అమెరికాలో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక

వరంగల్‌కు చెందిన అనిల్‌ కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. కొన్నేళ్లపాలు వివిధ కంపెనీల్లో పనిచేశాడు. కొంతకాలం సీఎన్‌ఎస్‌ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. ఇందులో హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో సాఫ్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విధులను సమర్థవంతంగా నిర్వహించాడు.

Written By: NARESH, Updated On : March 19, 2024 8:37 am

Anil Boinapally

Follow us on

Anil Boinapally : అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగోడు సత్తా చాటాడు. ప్రతిషా‍్టత్మక అవార్డుకు ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. వర్జీనియాలో నివాసం ఉంటున్న అనిల్‌ బోయినపల్లి అమెరికాలో వ్యాపారం చేస్తున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ ఇండో అమెరికన్‌ 2024 సంవత్సరానికి స్మాల్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. యునైటెడ్‌ స్టేట్‌‍్స స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, నేషనల్‌ స్మాల్‌ బిజినెస్‌ వీక్‌ అవార్డు – 2024 గ్రహీతలను ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు తమవంతు ప్రోత్సాహం, సహకారం అందించినందుకు గానూ అయిల్‌ బోయినపల్లి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. స్కై సొల్యూషన్స్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా అనిల్‌ బోయినపల్లి ఉన్నారు. వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

2008 నుంచి వ్యాపారం..
వరంగల్‌కు చెందిన అనిల్‌ కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. కొన్నేళ్లపాలు వివిధ కంపెనీల్లో పనిచేశాడు. కొంతకాలం సీఎన్‌ఎస్‌ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. ఇందులో హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో సాఫ్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విధులను సమర్థవంతంగా నిర్వహించాడు. అంతకుముందు ఫెన్నీ మే, హారిస్‌ కార్పొరేషన్‌లో కూడా వివిధ హోదాల్లో పనిచేశౠడు. 2008లో సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్‌ కంపెనీతో కలిసి స్కై సొలూ‍్యషన్స్‌ సంస్థ ఏర్పాటు చేశాడు. బిజినెస్‌ వ్యవహారాల్లో సాంకేతిక అంశాలకు సంబంధించిన సేవలను ఈ సంస్థ అందిస్తోంది. వర్జీనియా కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి తర్వాత అమెరికా అంతటా విస్తరించారు.

అవార్డుపై స్పందించిన అనిల్‌..
ఇక అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై అనిల్‌ స్పందించారు. ‘దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నాకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అమెరికా వంటి గొప్ప దేశంలో ఈ అవార్డు రావడం ఇక్కడ మనకు లభించిన అవకాశాలను ఉదాహరణగా చూపుతుంది’ అని అనిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఈ అవార్డులను ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో వాషింగ్‌టన్‌ డీసీలో వాల్డోర్స్‌ ఆస్టోరియా హోటల్‌లో ప్రదానం చేస్తారు. ఎస్‌బీఏ అడ్మినిస్ట్రేటర్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ క్యాబినెట్‌లో సభ్యుడైన ఇసాబెల్‌ కాసిల్లాస్‌ గుల్మాన్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డులను ప్రదానం చేస్తారు