
Tollywood ‘Guruvulu’: గురువు అంటే ఒక వ్యక్తి కాదు, భవిష్యత్తు తరాలకు వారధి. గురువు అంటే ఒక పదవి కాదు, ఎన్నో పదవులకు పునాది. గురువులు పాఠాలు మాత్రమే చెప్పరు, జీవన విధానాన్ని ఏర్పరుచుకోవడానికి.. ఉన్నత స్థితిలోకి ఎదగడానికి గురువులు బాటలు వేస్తారు. గురువులు అక్షరాలు మాత్రమే నేర్పించరు, లోకమంటే ఏంటో ఎన్నో భిన్నమైన కోణాల్లో అర్ధమైయ్యేలా చెబుతారు.
నేడు ఉపాధ్యాయుల దినోత్సవం. మరి ఈ సందర్భంగా వెండితెర పై గురువులుగా కనిపించిన హీరోల గురించి తెలుసుకుందాం.
‘బడిపంతులు’ :
పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీవితాలను పర్ఫెక్ట్ గా చూపించిన సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్ స్కూల్ టీచర్ గా అద్భుతంగా నటించారు. ఓ గురువు విలువలతో కూడిన జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఎన్టీఆర్ పాత్ర మనకు చెబుతుంది. ఏది ఏమైనా గురుశిష్యుల మధ్య అనుబంధాన్ని పెంచే విధంగా అద్భుతంగా సాగుతుంది ఈ సినిమా.

సుందరకాండ :
వెంకటేశ్ కెరీర్ లోనే ప్రత్యేక సినిమా ఇది. గురువు పైనే ఓ అమ్మాయి ఆకర్షణకు లోనై ప్రేమలో పడితే ? ఆ శిష్యురాలు పరిస్థితి ఏమిటి ? గురువు ఆమెను ఎలా మార్చాడు ? ఆమెకు ఎలా కనువిప్పు కలిగించాడనే కథతో సాగుతుంది ఈ సినిమా.

‘మాస్టర్’ :
విద్యార్థుల్లో పరివర్తన తీసుకొచ్చే శక్తి గురువుకే సాధ్యమతుందని చాటి చెప్పిన సినిమా ఇది. ‘మాస్టర్’గా చిరంజీవి అద్భుతంగా నటించారు. శిష్యులను సరైన దారిలో నడిపే గురువుగా చిరు నటన చాలా బాగుంది.

‘ఓనమాలు’ :
రాజేంద్రప్రసాద్ హీరోగా క్రాంతిమాధవ్ తీసిన సినిమా ‘ఓనమాలు’. పాఠాలు బోధించే గురువుకు పదవీ విరమణ అంటూ ఉండదని చాటి చెప్పిన సినిమా ఇది.

‘సై’ :
గురువు అంటే పాఠాలే కాదు, ఆటల్లోనూ విజయాన్ని అందించగలడు అని నిరూపించిన సినిమా ఇది. ఈ పాత్రను రాజీవ్ కనకాల అద్భుతంగా పోషించాడు.

‘గోల్కొండ హైస్కూల్’ :
సుమంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా ఆటల్లో గెలుపు రుచి చూస్తే జీవితంలో ఏదైనా సాధించొచ్చు అని నిరూపించిన మరో సినిమా ఇది. సుమంత్ ఈ సినిమాలో క్రికెట్ కోచ్‌గా నటించి మెప్పించారు. ఇలా చాలా సినిమాలే వచ్చాయి.
