
గత అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ళ నుండి 61 ఏళ్లకు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి దీనిని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
గతవారం ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆ మేరకు గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచితే ఖజానాకు ఎంత వరకు రిలీఫ్ ఉంటుందనే దానిపై అధికారులు లెక్కలు తీశారు. రెండేండ్లుగా పీఆర్సీ రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఉద్యోగుల్లో కొందరినైనా సంతృప్తి పరచాలంటే ఉద్యోగ విరమణ వయస్సును పెంచడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా అధికారమలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ఆ మేరకు పెంచక పోవడంతో ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తి నెలకొంది. దానిని గ్రహించిన కేసీఆర్ 60 ఏళ్లకు కాకుండా 61 ఏళ్లకు పెంచుతామని అంటూ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో భరోసా ఇచ్చారు.
అయితే ఎన్నికలు ముగిసి సంవత్సరం దాటినా ఇంకా ఆ ప్రసక్తి తీసుకు రాకపోవడం, మరోవంక వేతన సవరణ గురించి మాట్లాడక పోవడంతో ఉద్యోగ వర్గాలు అసహనంగా ఉన్నాయి. ఈ అంశంపై త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమావేశంలోనే ఉద్యోగ విరమణ వయస్సు పెంపుతో పాటు పీఆర్సీపై కూడా కీలక ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు.
ఉద్యోగ విరమణ వయసును పెంచితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడేండ్ల పెంపుతో దాదాపు రూ. 9 వేల కోట్ల వరకు రిలీఫ్ ఉంటుందని వారు లెక్కలు గట్టారు. ఆర్థిక పరిస్థితి ఆశించినట్టుగా లేకపోవడంతో పీఆర్సీ అమలు కంటే ముందు ఉద్యోగ విరమణ వయసును పెంచాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తున్నది.