Trump tariff cancellation: అగ్రరాజ్యం అమెరికా ఫస్ట్.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆయన ఏడాది ఫాలనంతా టారిఫ్ వార్‌తోనే సరిపోయింది. రియల్ వార్స్ ఆపుతామన్న ట్రంప్.. తానే యుద్ధాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఇష్టానుసారం టారిఫ్‌లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన అమెరికా సుప్రీం కోర్టు అవి రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ తీర్పు ప్రపంచ దేశాలకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం తీసుకురాకపోయినా, అమెరికా ఇంతకాలం వసూలు చేసిన టారిఫ్‌లు రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వసూలైన సుంకాలపై అస్పష్టత..
కోర్టు తీర్పులో గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు సేకరించిన సుమారు 133 నుంచి 175 బిలియన్ డాలర్ల సుంకాలను తిరిగి చెల్లించాల్సిన అంశాన్ని పేర్కొనలేదు. ఇది రూ.12 నుంచి 16 లక్షల కోట్లకు సమానం. సుప్రీం తీర్పు నేపథ్యంలో దీనిపై దిగువ కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
భారత ఎగుమతిదారులకు రీఫండ్ ఆశలు
ఈ సుంకాలు చెల్లించింది అమెరికాలోని దిగుమతి కంపెనీలు మాత్రమే కాబట్టి, రీఫండ్ ఆయా సంస్థలకు మాత్రమే వెళ్తుంది. భారతదేశం నుంచి ఎగుమతులు చేసినవారికి నేరుగా పరిహారం దక్కే అవకాశం తక్కువ, కానీ మార్కెట్ పోటీ తగ్గడంతో భవిష్యత్ ఎగుమతులకు లాభం చేకూరవచ్చు.
రీఫండ్ ప్రక్రియ సవాళ్లు
రీఫండ్ కోసం కస్టమ్స్ ఏజెన్సీలో చట్టపరమైన దరఖాస్తు చేసుకోవాలి, ఇది 12–18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. గతంలో హార్బర్ ఫీజుల విషయంలో ఇలాంటి ప్రక్రియలు జరిగినప్పటికీ, ఇంత పెద్ద మొత్తం కోసం మొదటిసారి అయినందున గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు టారిఫ్‌ల రద్దుతో ఎగుమతిదారులు నేరుగా లాభపడకపోయినా ఐటీ, స్టీల్, ఫార్మా రంగాలకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాల పునఃసమీక్షకు ఈ తీర్పు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.