
పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించేందుకు ఢిల్లీ రావాలంటూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు కేంద్రం మరోసారి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 14 సమావేశానికి వారిద్దరూ గైర్హాజరైన నేపథ్యంలో మరోసారి వారిని ఢిల్లీకి రావాలంటూ కేంద్రం ఆదేశించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిపై వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున వారిని ఢిల్లీకి పంపడం కుదరదంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్లీ తిరస్కరించింది. కేంద్రం దీనిపై ఇంకా స్పందించలేదని సమాచారం. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు జరిగే సమావేశానికి సీఎస్, డీజీపీలను పంపాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నిన్న లేఖ రాసింది. దీంతో అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేయాలని బెంగాల్ ప్రభుత్వం సూచించింది. కాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ మీద పంపాలంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై సీఎం మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.