
సంక్రాంతి తర్వాతి కానుమ్ పొంగల్ వేడుకల సందర్భంగా బీచ్‌ల్లో జనసంచారంపై నిషేధంతోపాటు మరికొన్ని నిబంధనలతో జనవరి నెలాఖరువరకూ కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గత మార్చి 25 నుంచి రాష్ట్రంలో కఠిన నిబంధనలు, సడలింపులతో లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని ఆ ప్రకటనలో సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం తీసుకున్న కరోనా నిరోధక చర్యల కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టిందని, గత పది రోజులుగా కరోనా బాధితుల సంఖ్య 1100లోపే వున్నాయని, చికిత్స పొందుతున్నవారి సంఖ్య 50 వేల నుంచి 8867కు తగ్గిందని ఆయన పేర్కొన్నారు.