
కరోనా నివారణకు అనేక దేశాల్లో వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన ‘ఫైజర్ ’ టీకా అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) అనుమతులు ఇచ్చింది. తాజాగా మరో కంపెనీ ‘మోడార్నా’కు చెందిన టీకాకు ఎఫ్ డీఏ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ కూడా ‘ఫైజర్’ లాగే పనితీరును కనబర్చడంతో అనుమతినిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికాలో కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న వేళ రెండు టీకాలతో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాగా సోమవారం నుంచి ‘మోడార్నా’వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మోడార్నా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫైజర్ టీకా మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి, కానీ మోడార్నా సాధారణ ఫ్రిజ్ లో కూడా నిల్వ చేయవచ్చని తెలిపారు.