
ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీలో రైతులు 37 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. కొత్త సంవత్సరపు తొలిరోజు కూడా.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా.. రైతు సంఘాలు, ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా.. ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. అదేవిధంగా తమ డిమాండ్లు నెరవేరేవరకు తమకు మద్దతుగా నిలవాలని రైతు సంఘాల నేతలు కోరారు. కాగా, ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య మరో విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో రైతు సంఘాలు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి శుక్రవారం మధ్యాహ్నం సింఘ సరిహద్దు వద్ద రైతు సంఘాలు భేటీకానున్నాయి.