
తమిళనాడు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 604 మంది పార్టీ కార్యకర్తలపై కేసు నమోదైంది. ఇటీవల ఏఐఏడీఎంకే పార్టీ నుంచి డీఎంకేలో చేరిన మార్కండేయన్ చెన్నైలోని విలాతికుళంలో జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాడు. అదే సమయంలో ఏఐడీఎంకే పార్టీ ఎమ్మెల్యే చెన్నప్పన్ నేతృత్వంలో అక్కడే సమావేశమయ్యారు. ఈ పార్టీ నాయకులు ద్రువం సమీపంలో జెండా ఎగురవేయడానికి ప్రయత్నించారు. అయితే వీరు పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు. దీంతో రెండు పార్టీల నుంచి ఒకేసారి కార్యకర్తలు గూమిగూడడంతో పోలీసులు చెదరగొట్టారు. స్వల్ప లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్తకు కారణమైన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు 604 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశామని విలాతికుళం పోలీసులు తెలిపారు.