PM Vishwakarma Yojana: దేశాన్ని ఓ వైపు డిజిటల్ రంగం వైపు అభివృద్ధి చేయడమే కాకుండా మరోవైపు సాంప్రదాయ వృత్తులను కాపాడుకునేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా వివిధ పథకాల పేరిట సంప్రదాయవాదులను ప్రోత్సహిస్తోంది. తాజాగా చేతి వృత్తులు, హస్తకళల అభివృద్ధి చెందేలా ఆ రంగానికి చెందిన వారికి రుణ సాయం చేయాలని సంకల్పించింది. దీనికి ‘విశ్వకర్మ కౌసల్య యోజన’ అనే పేరు పెట్టారు. . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ‘పీఎం విశ్వకర్మ కౌసల్య యోజన’ అనే స్కీంను ప్రారంభించారు. దేశంలోని 18 రకాల సంప్రదాయ వృత్తుల వారు అభివృద్ధి చేసుకునేందుకు పరికరాల కోసం దీని ద్వారా రుణం తీసుకోవచ్చు. అతి తక్కువ వడ్డీతో మాత్రమే చెల్లించవచ్చు. మరి ఈ పథకం వివరాల్లోకి వెల్తే..
ఎవరు అర్హులు?
‘విశ్వకర్మ కౌసల్య యోజన’ పథకం లబ్ధి పొందాలంటే వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారీదారులు అర్హులు. అలాగే కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, రాళ్లుపగులగొట్టేవారు, చర్మకారులు (పాదరక్షలు తయారు చేసేవారు), మేదరులు (గంపలు, చాపలు, చీపురులు తయారుచేసేవారు ) ఆటబొమ్మలు తయారుచేసేవారు, నాయి బ్రహ్మణులు (క్షౌర వృత్తి చేసేవారు), మాలలు అల్లేవారు ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కింద మొదటి విడతగా 18 రకాల చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. భవిష్యత్ లో మరిన్న చేతి వృత్తులను చేరుస్తారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే https://pmvishwakarma.gov.in/ అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మీ సేవా ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. మొబైల్ ద్వారా కూడా అవగాహన ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్, రేషన్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్, పాన్ కార్డు ఉండాలి.
ఎంత రుణం ఇస్తారు?
ఈ పథకం వర్తించిన వారికి 2 దశల్లో రూ.3 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ రుణ మొత్తాన్ని 5 శాతం వడ్డీతో వసూలు చేస్తారు. మిగతా వడ్డీని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా చేతి వృత్తులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కాలంలో వీరికి స్టైఫండ్ అందిస్తారు.ఈ పథకం గురించిపూర్తిగా తెలుసుకోవాలనుకుంటే https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.