Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ లో మన సర్గార్ తొలి పతకాన్ని పట్టేశాడు. భారత ఖాతా తెరిచాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ కు తొలి పతకం అందింది. భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గార్ 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 135 కేజీలు, స్నాట్చ్ లో 113 కేజీలు ఎత్తేశాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.

క్లీన్ అండ్ జెర్క్ లో మొదటి ప్రయత్నంలోనే మన సర్గార్ 135 కేజీలు ఎత్తేశాడు. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. ఇక మలేషియాకు బిన్ మహమద్ అనిఖ్ కేవలం ఒకే ఒక్క కేజీ అదనంగా ఎత్తి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయాడు.
స్నాచ్ లో 107 కేజీలను మాత్రమే ఎత్తిన అనిఖ్.. క్లీన్ అండ్ జెర్క్ లో మాత్రం 142 కేజీలను ఎత్తాడు. దీంతో మొత్తం 249 కేజీల బరువును మోసి గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమార యోదగె 225 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు.
బ్యాడ్మింటన్ పోటీల్లో ఇప్పటికే పాకిస్తాన్ ను ఓడించిన భారత్ గ్రూప్ ఏలో లంకపైనా ఆధిక్యం సాధించింది. మిక్స్ డ్ ఈవెంట్ లో భారత్ 3-0తో లీడ్ లో ఉంది. ఇక పురుషుల మారథాన్ ఫైనల్ లో భారత్ అథ్లెట్ రావత్ 17వ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. మొత్తంగా ఈ కామన్వెల్త్ లోనే సర్గార్ మన భారత్ కు తొలి పతకాన్ని సాధించి పెట్టి మన పతాకాన్ని ఎగురవేశాడు.