Budget 2024 Expectations: డబ్బు అనేది కేవలం నోటు మాత్రమే కాదు. ఒక మనిషి మనుగడను నిర్దేశిస్తుంది. ఒక ప్రాంతం అభివృద్ధిని, అది వేసే అడుగులను, ఒక సమూహం ఉనికిని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలను అది ప్రభావితం చేస్తుంది. మన ఇంట్లో అయితే వచ్చేరాబడి, అయ్యే ఖర్చును పెద్దవాళ్లు చూసుకుంటారు. అదే ఒక దేశానికి సంబంధించింది అయితే ఆర్థిక శాఖ మంత్రి దానిని పర్యవేక్షిస్తారు. ఒక ఏడాదికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించే జమా ఖర్చులను స్థూలంగా బడ్జెట్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ బడ్జెట్ మనదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బడ్జెట్ అనగానే ఎందుకు అందరిలో ఆసక్తి కలుగుతుంది? ఆ బడ్జెట్ సగటు భారతీయుడిని ఎందుకు ప్రభావితం చేస్తుంది.. ఈ అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్థిక శాస్త్రాన్ని భారత మేధావి కౌటిల్యుడు రూపొందించినప్పటికీ.. మన దేశానికి సంబంధించి తొలి బడ్జెట్ ను ఏప్రిల్ 7, 1860 సంవత్సరంలో స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. అప్పట్లో ఆంగ్లేయులు భారత దేశాన్ని పరిపాలించారు కాబట్టి.. బడ్జెట్ ను శ్వేత జాతీయలతోనే ప్రవేశ పెట్టించేవారు. భారతదేశానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ను అప్పటి ఆర్థిక మంత్రి షణుముగం చెట్టి నవంబర్ 26, 1947 సంవత్సరంలో సమర్పించారు. అప్పట్లో పేదరిక నిర్మూలనకే అధికంగా నిధులు కేటాయించారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మన దేశంలో ఎంతోమంది ఆర్థిక మంత్రులు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో సుదీర్ఘ సమయం ప్రసంగించిన ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె ఘనత సొంతం చేసుకున్నారు. మాటల పరంగా చూసుకుంటే మన్మోహన్ సింగ్ పేరిట ఆ ఘనత ఉంది. హిరూభాయ్ ముల్జి పటేల్ అతి తక్కువ సమయం ప్రసంగించిన ఆర్థిక శాఖ మంత్రిగా ఘనత సాధించారు. అత్యధిక(పదిసార్లు) బడ్జెట్ ప్రతిపాదనలు పంపించిన రికార్డు దివంగత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉంది.
ఆర్థిక శాఖ మంత్రి రూపొందించిన బడ్జెట్ సమర్పణను గతంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించారు. అది రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగేది. అయితే ఈ విధానానికి యశ్వంత్ సిన్హా చరమగీతం పాడారు. 1999 నుంచి బడ్జెట్ సమర్పణను సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం 10 గంటలకు మార్చారు. 1955 వరకు బడ్జెట్ ప్రతులను కేవలం ఇంగ్లీషులో మాత్రమే రూపొందించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని హిందీలో కూడా రూపొందించాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్పటినుంచి హిందీ, ఇంగ్లీషులో బడ్జెట్ ప్రతులను రూపొందిస్తున్నారు. బడ్జెట్ సమర్పణ గతంలో ఫిబ్రవరి 28న మాత్రమే ఉండేది. దానిని 2017 నుంచి ఫిబ్రవరి 1కి అరుణ్ జైట్లీ మార్చారు. కాకపోతే బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ఒక రోజు ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి హల్వా తయారు చేస్తారు. ఆ హల్వాను బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న అధికారులందరికీ పెడతారు.