DK Suresh: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే సింహభాగం దక్కుతుంది. అనే ఓ నానుడి ఉంది. ఇప్పుడు అది ఉత్తరాది రాష్ట్రాల విషయంలో నిజం అవుతుంటే.. మన విషయంలో మాత్రం అబద్దమవుతున్నదని దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ఆరోపిస్తున్నాయి. పన్నులు నిక్కచ్చిగా వసూలు చేస్తూ, తిరిగి ఇచ్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశాన్ని విడగొట్టి దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ స్వయంగా పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా సురేష్ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసింది. తమ విధానం విభజించడం కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో ధర్నా చేయడం విశేషం. కర్ణాటక ప్రభుత్వ పెద్దలకు మద్దతుగా తమిళనాడు అధికార పార్టీ నాయకులు ఢిల్లీలో నిరసనకు దిగారు. తర్వాత కేరళ కూడా ధర్నా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడంలేదని అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఈ పరిణామాలు మాత్రమే కాదు గతంలో జరిగిన సంఘటనలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే విషయాన్ని రుజువు చేశాయి. ఇక్కడి ప్రజల్లో కేంద్రంపై అసంతృప్తి పెరుగుతోందనేలా సంకేతాలు ఇచ్చాయి. నిధుల విషయంలో కేంద్రంపై కోట్లాడుతున్నామని చెబుతున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు.. విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తుండడంతో పరిస్థితిగా ఉద్రిక్తంగా మారుతుంది. ఇది క్రమక్రమంగా విస్తరిస్తే పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి.
ఇలాంటి అసమ్మతి గళాలు వెలుగు చూడకుండా ఉండాలి అంటే కేంద్రం పన్నుల పంపిణీలో అసమానతలు తలెత్తకుండా చూసుకోవాలి. తాము కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తుంటే.. కేంద్రం నుంచి మాకు 15 పైసలు మాత్రమే వస్తున్నాయని.. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండు రూపాయలు ఇస్తున్నారని కన్నడ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండడం ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇలాంటి సమయంలో ఈ స్థాయిలో నిరసన గళాలు గొంతు ఎత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. నివేదికల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్నులను.. తిరిగి వాటికి కేటాయించే విషయంలో భారీగా తేడా ఉందనేది స్పష్టం అవుతుంది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆదాయ పంపిణీ జరిగేది. ఇకపై 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో ఆదాయ పంపిణీ జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కల ప్రకారం ఆదాయ వనరుల పంపిణీ జరిపింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం 2001 జనాభా లెక్కల ప్రకారం ఆదాయ పంపిణీ చేస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో జనాభా నియంత్రణకు సంబంధించి కఠినమైన విధానాలు అవలంబించింది దక్షిణాది రాష్ట్రాలే. అయితే ఆ జనాభా నియంత్రణ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై శాపంగా మారిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు సరిగా జనాభా నియంత్రణ పాటించకపోవడంతో అది వారికి ఇప్పుడు లాభంగా మారింది.
ఇలాంటి ప్రత్యేక పరిస్థితులున్న నేపథ్యంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు దక్కేలా చూడాలి అనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. లేకుంటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పుట్టిన ముసలం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు వాటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అప్పులు తీసుకొస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి ఈ నిధులను గ్రాంట్ల రూపంలో పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తీసుకొచ్చుకునే అప్పులపై కేంద్రం పరిమితి విధించడం సరికొత్త వివాదానికి తెర తీస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్రం నూరు శాతం చిత్తశుద్ధితో ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. అక్కడిదాకా ఎందుకు ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 12 రాష్ట్రాలలో 12 గోదాములు నిర్మిస్తామని ప్రకటించింది. కానీ ఆ జాబితాలో ఒక్క దక్షిణాది రాష్ట్రం కూడా లేకపోవడం విశేషం. గోదాముల నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఎంపిక చేసిన తొలి విడత తొమ్మిది రాష్ట్రాలు కూడా ఉత్తరాది ప్రాంతానికి చెందినవే. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోరుబాట పట్టిన నేపథ్యంలో పై విషయాలు మొత్తం చర్చకు వస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలి అంటే.. అక్కడ చేసే వ్యయంలో 15% రాబడి రావాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖచ్చితమైన షరతు విధిస్తోంది. అదే గుజరాత్ లోని సోమనాథ్ క్షేత్రం చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి ఎలాంటి నిబంధనలు విధించలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు మాత్రమే కాకుండా లోక్ సభ సీట్ల తగ్గింపు వివాదం కూడా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందనే చర్చ ప్రజల్లో జరగడానికి కారణమవుతున్నది. మరి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దీనిని బిజెపి ఏ విధంగా సరిదిద్దగలదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.