Cyclone Biporjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన జపర్ జాయ్ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. గుజరాత్ ను వణికిస్తోంది. చెట్లు, కరెంటు స్తంభాలు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. భారీగా నష్టం జరిగింది. ప్రస్తుతం ఈ తుఫాను బలహీన పడి వాయుగుండం ఏర్పడటానికి కారణమైంది. ఆగ్నేయ పాకిస్తాన్, వాయువ్య రాజస్తాన్, గుజరాత్ లోని కచ్ పై తీవ్ర ప్రభావం చూపింది.
ప్రస్తుతం రాజస్తాన్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. బార్కర్ జిల్లానుంచి ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావం ఢిల్లీపై కూడా పడింది. అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం ఢిల్లీలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. దీంతో వరదలు ఉప్పొంగుతున్నాయి. రోడ్లన్ని నీళ్లతో నిండిపోయాయి. పంటపొలాలన్ని నీటిలో మునిగాయి. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
కచ్ జిల్లాలో 33 వేల హెక్టార్ల పంట నీటి పాలైంది. జకావూలోని షిపింగ్ యార్డ్ ధ్వంసమైంది. దాదాపు 80 వేల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. చెట్లు అయితే ఎక్కడ చూసినా పడిపోయే ఉన్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మార్గం సుగమం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రజలకు అండగా నిలవాలన్నారు. రోడ్డపై పడిన చెట్లు, కరెంటు స్తంభాలను తొలగించి అసౌకర్యాలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.