Nitin Gadkari Ethanol: పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత వెనుకబడిపోయింది. మళ్లీ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీస్ట్ మోడ్లో కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం వీర లెవెల్ లో సంచలన విషయాలను బయటపెడుతోంది. రాహుల్ గాంధీ బీహార్ యాత్రకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను బయటపెడుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం సంచలన విషయాన్ని బయటపెట్టింది.
Also Read: బీహార్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు కేజ్రివాల్ షాక్.. ఈ ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెబుతారా?
కాంగ్రెస్ కీలక విషయాన్ని బయట పెట్టింది
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఇటీవల కాలంలో ఇథనాల్ మంత్రాన్ని పదే పదే జపిస్తున్నారు. మనదేశంలో వాహనదారులు ఉపయోగించే ఇంధనంలో ఇథనాల్ వాడాలని..ఇథనాల్ ఇంధనాన్ని ఎక్కువగా వాడితే కాలుష్యాన్ని తగ్గించవచ్చని గడ్కరి సూచిస్తున్నారు. ఆయనకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఇదే మాట మాట్లాడుతున్నారు. సాధారణంగా ఈ మాట మిగతా వారికి పెద్దగా తప్పుగా అనిపించదు. పైగా ఇంధనంలో ఇథనాల్ వాడటాన్ని పర్యావరణహితకారులు మంచి నిర్ణయమని చెబుతున్నారు. అయితే దీని వెనుక కుంభకోణం ఉందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాదు తన ఆరోపణలకు తగ్గట్టుగా సంచలన విషయాలను బయటపెట్టింది.
ఊహించని లాభాలు
గడ్కరి కుమారుడి పేరు నిఖిల్. అతడికి సిఐఏన్ అగ్రో అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఇథనాల్ పెట్రోల్ తయారుచేస్తుంది. 2024 జూన్ త్రైమాసికానికి ఈ కంపెనీ కేవలం 17 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఏడాది కాలంలో ఆ కంపెనీ 511 కోట్ల ఆదాయానికి చేరుకుంది. కంపెనీ షేర్ విలువ కూడా 43 రూపాయల నుంచి 668 రూపాయలకు పెరిగింది.. ఈ 20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు నాశనం అవుతున్నాయని.. నిఖిల్ వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇదంతా ఒక కుంభకోణం అని మండిపడింది. తన కుమారుడి కంపెనీకి లాభాలు చేకూర్చడానికే నితిన్ పదేపదే ఇథనాల్ పెట్రోల్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి నితిన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు బిజెపి కూడా కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు దీటుగానే స్పందిస్తోంది. మార్పులను ఆహ్వానించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని.. వారి వద్ద నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం తప్పే అని బిజెపి వ్యాఖ్యానిస్తోంది.